ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పుచ్చుకోలేను: జానారెడ్డి

 

కొందరు నేతలకి తాము ప్రధాన మంత్రి పదవికి అర్హులమనిస్తుంది. మరి కొందరికి ముఖ్యమంత్రి పదవికి తాము అన్ని విధాల అర్హులమనిపిస్తుంది. కానీ, ఎన్ని సం.లు ఎదురుచూసిన ఆ అవకాశం రానప్పుడు కడుపులో ఉన్నఆ మంట అప్పుడపుడు ఏదో ఒక రూపంలో లావాలా బుసబుసమని బయటకి ఉబికి వస్తోంటుంది. తనకు దక్కని అందలం వేరొకరికి దక్కడం ఆ మంటని మరింత రాజేస్తుంది. అప్పుడు, అది దక్కినవారిపై ఒకటీ అరా విసుర్లు తప్పవు.

 

ఇటువంటి తీరని కోరికతో ‘రాజకీయ నరకం’ అనుభవిస్తున్న పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు కే.జానారెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవచేసుకొని తరించాలని ఉందని నిన్ననే మరోమారు ప్రకటించారు. అయితే, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేస్తే మాత్రం ఆయన పుచ్చుకోలేనని ఆయన తెగేసి చెప్పారు. తెలంగాణా ఇచ్చిన తరువాత అయితేనే తనకు వీలవుతుందని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి పదవికి ముహూర్తం కూడా ఆయనే నిర్నయించేసుకొన్నారు గనుక, ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారి పదవికి ఆయన ఎసరు పెట్టబోవడం లేదని స్పష్టం అయింది.

 

అయితే, తానూ పార్టీ టికెట్ కోసం కానీ,మంత్రి పదవికోసం గానీ ఎప్పుడూ ఎవరి కాళ్ళు పట్టుకోలేదని, అన్నీ వాటంతటవే వచ్చి తన ఒళ్లో పడ్డాయని తెలియజేసారు. అందువల్ల ఇవాళ కాకపొతే రేపయినా ముఖ్యమంత్రి పదవికూడా అదేవిధంగా వచ్చి ఆయన ఒళ్లో పడుతుందని భావిస్తునట్లున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు, లేదా ఆ పదవిలో ఉన్నవారు డిల్లీలో పైరవీలు చేసుకొంటారు అని ఒక చిన్నసన్నాయి నొక్కునొక్కి పనిలోపనిగా తన నోటి దురద కూడా తీర్చుకొన్నారు.

 

తనకి దురద ఉంటే గోక్కోవడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఎదుట వాడిని గోకుతానంటేనే ఇబ్బంది వస్తుంది. ఇన్నేళ్ళుగా పార్టీకి సేవలందిస్తున్నపటికీ, తనని కాదని కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవినీయడం ఆయన కడుపులో మంటకు కారణం అయింది. అందుకే, ముగింపుగా ఆయన పై ఒక చిన్నవిసురు విసిరి జానారెడ్డి తన కడుపులో మంటను చల్లార్చుకొన్నారు.

 

అయితే, దానివల్ల తన కడుపు మంట చల్లారినా, కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం ద్వారా ఆయనతో కయ్యానికి కాలు దువ్వడమే కాకుండా, కాంగ్రెస్ అధిష్టానం  పైరవీలకే మొగ్గు చూపుతుందనే నిందవేసి, తన గోతిని తానే తవ్వుకొన్నారు పాపం. అధిష్టానం వద్ద మంచి పేరున్న కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మాటలను సోనియాగాంధీ చెవిలో వేస్తే, ఇక ఆయన ఈ జన్మకి ముఖ్యమంత్రి కాలేరని తెలుసుకోక నోరుజారారు.

 

బహుశః ఇటువంటి నోటి దురద ఉన్నందునే కాంగ్రెస్ అధిష్టానం ఆయనని ఎప్పుడూ కూడా లెక్కలోకి తీసుకోలేదు. జానా రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా పైరవీల సంగతి పక్కన పెడితే రోశయ్య, రాజశేఖర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారందరికీ కేవలం వారి విశ్వసనీయత కారణంగానే ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. పార్టీ అధిష్టానం పట్ల అచంచమయిన విశ్వాసం, తమ సమర్ధతను పార్టీ గుర్తించేలా చేసుకోవడం ద్వారానే వారికి ఆ పదవి దక్కింది. కానీ, జానారెడ్డిలో అవే లోపించినట్లు  కాంగ్రెస్ అధిష్టానం భావించడం వల్లనే ఆయన కల సాకారం కాలేకపోతోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణా అంశం పై ఆయన పార్టీని ఏవిధంగా ఇరుకున పెట్టారో చూసినట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఎందుకు విశ్వసించడం లేదో ఆయనకే అర్ధం అవుతుంది.