ఛలో అసెంబ్లీ హిట్టా ఫట్టా
posted on Jun 15, 2013 @ 2:23PM
.....సాయి లక్ష్మీ మద్దాల
తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు. ఇది చాలామంది తెలంగాణా వాదుల సందేహం కూడా. ఇంతకు ముందు తలపెట్టిన తెలంగాణా మార్చ్ లో కూడా కె.సి.ఆర్ పాల్గొనలేదు. అంటే వారు పిలుపునిస్తారు కానీ వారు మాత్రం ఫామ్ హౌసులొ విశ్రాంతి తీసుకుంటారు. చదువుకోవలసిన విద్యార్ధులు వారి భవిష్యత్ నాశనం చేసుకోవాలి, రోజు కూలీలు వారి బ్రతుకు నష్ట పోవాలి కాని గులాబి బాస్ మాత్రం అంత అయిపోయిన తర్వాత తెలంగాణ బంద్ కు మళ్ళి పిలుపునిస్తారు. మల్లి ఇక్కడ నష్టపోయేది అదే సామాన్య ప్రజానీకం.
అసలు నిన్న జరిగిన ప్రహసనాన్ని చూస్తే రాజకీయ నాయకులు అంటేనే జుగుప్సగా అనిపిస్తోంది. ఎవరికి వారే రాజకీయ లబ్ధి కోసం పార్టీలతో సంబంధం లేకుండా రోడ్డెక్కి ఛలోఅసెంబ్లీఅని నినాదాలు,అరెస్టులు విపరీతమైన రాజకీయ నాటకాలు. ఏరాజకీయ లబ్దికోసం వీరు ఇంతగా తాపత్రయ పడుతున్నారో ప్రజలకు అర్థం కావటంలేదనే భ్రమలో వారు ఉన్నారు. కానీ ప్రజలకు అన్ని తెలుసు. కానీ ఒక్క విషయంలో వీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభాపతులుగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు సభా మర్యాదను కాపాడుతామని,సభ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని ప్రమాణం చేసిన ఈపెద్దమనుషులు నిన్న అన్నీ మర్చిపోయారా? వారి రాజకీయ స్వార్ధం ముందు సభ దాని విలువ,మర్యాద , గౌరవం అన్ని మంట గలసి పోయాయా? ఈనాడు శాసనసభ పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించిన వీరికి మళ్ళి ఎన్నికలలో నిలబడే అర్హత ఉందా? ఎన్నికల కమీషన్ ఎలాంటి చర్యలు వీరి మీద తీసుకోదా?