పాకిస్థాన్ ఉగ్రదేశమే.. అమెరికా పార్లమెంట్ లో బిల్లు
posted on Sep 21, 2016 @ 12:36PM
అమెరికా.. పాకిస్థాన్ మిత్ర దేశాలు అయినప్పటికీ ఈ మధ్య పాకిస్థాన్ వైఖరిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్థావరం కల్పిస్తుంది అని ఎప్పటినుండో అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో తాజా నిర్ణయం తీసుకుంది అమెరికా. అదేంటంటే.. పాకిస్థాన్ ఉగ్రదేశమేనంటూ, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని సూచిస్తూ, అత్యంత కీలకమైన బిల్లు యూఎస్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ప్రజా ప్రతినిధి, ఉగ్రవాదంగా హౌస్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబాకర్ లు ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పాకిస్థాన్ కచ్చితంగా ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశమే. పాక్ కు ఇస్తున్న ద్వైపాక్షిక సాయాన్ని నిలిపివేయాల్సిన సమయం వచ్చింది. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి" అని అన్నారు. ఇకపై ఎంతమాత్రమూ పాకిస్థాన్ ను నమ్మలేమని, విశ్వసనీయతలేని మిత్రదేశంగా పాక్ మారిందని, అమెరికాకు శత్రువులను ఎన్నో ఏళ్లుగా ఆ దేశం పెంచి పోషిస్తోందని పోయ్ ఆరోపించారు.