చంద్ర‌బాబు స్కిల్ సెన్సెస్.. దేశానికే ఆద‌ర్శం?

ఏపీలోచంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. స‌చివాల‌యం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప‌లు హామీల‌కు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇందులో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయ‌గా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. పింఛన్‍ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఐదో సంత‌కం స్కిల్ సెన్సెస్ పై చేశారు.

ఈ ఐదు సంతకాల్లోనూ అత్యంత కీలకమైనది  స్కిల్ స‌న్సెస్‌. రాబోయే కాలంలో ఈ స్కిల్ సెన్సెస్‌ దేశానికే ఆద‌ర్శం అవుతుంద‌ని విద్యావంతులు పేర్కొంటున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీలో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు లేక ఇత‌ర రాష్ట్రాల‌కు  త‌ర‌లిపోయారు. దీనికితోడు ఏపీకి రాజ‌ధాని లేక‌పోవ‌టం, జగన్ పారిశ్రామిక వ్యతిరేక విధానాల కారణంగా కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి రాలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన కంపెనీలు సైతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. దీంతో ఉపాధి అవ‌కాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. తాజాగా.. రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు చంద్ర‌బాబు నాయుడు స్కిల్ సెన్సెస్ ను అమ‌ల్లోకి తీసుకురాబోతున్నారు. 

స్కిల్ సెన్సెస్ దేశంలో అత్యంత ముఖ్య‌మైన అంశంగా మార‌బోతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌ విధంగా చెప్పాలంటే రాబోయే కాలంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు స్కిల్ సెన్సెస్ ను అమ‌లు చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. దీనిలో అంత ప్రాముఖ్య‌త ఏముంద‌నే విష‌యానికి వ‌స్తే.. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్ర‌ ప్ర‌జ‌లు అన్ని విధాలుగా న‌ష్ట‌పోయారు. ముఖ్యంగా చ‌దువుకున్న యువ‌త అయితే.. ఉద్యోగాలు లేక చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. కొంద‌రు ఉపాధికోసం ఇత‌ర రాష్ట్రాల‌కు, దేశాల‌కు వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు రాష్ట్రంలోనే ఉంటూ గంజాయి, మ‌త్తు ప‌దార్ధాల‌కు అల‌వాటుప‌డి త‌మ జీవితాల‌ను అంధ‌కారంలోకి నెట్టేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ‌ యువ‌తకుతోడు.. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారికోసం చంద్ర‌బాబు నాయుడు స్కిల్ సెన్సెస్ అనే కార్య‌క్ర‌మాన్ని అమ‌ల్లోకి తీసుకొస్తూ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే సంత‌కం చేశారు.

ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ప్ర‌పంచంలోని ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్ర‌ముఖ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశాలు ఉండ‌టంతో పాటు.. ఇక్కడ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది. స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికి వెళ్లి స‌ర్వే చేస్తారు. ఆధార్ కార్డు ద్వారా ఇంట్లో ఎంత మంది చ‌దువుకున్న యువ‌త ఉన్నారు. వారు ఎంత‌వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌స్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే ఏ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారు ఏఏ కంపెనీలు, ఏఏ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నారు అనే వివ‌రాల‌ను సేక‌రిస్తారు. ఈ వివ‌రాల ద్వారా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న‌వారు ఎంత మంది ఉన్నార‌నే విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉంటున్న యువ‌త‌కు వారికి ఆస‌క్తి ఉన్న‌రంగాల్లో శిక్ష‌ణ‌  ఇస్తారు.

ఇక్క‌డ మ‌నం ఓ విష‌యం తెలుసుకోవాలి.. ఒక రాష్ట్రంలో ల‌క్ష‌ల‌ కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలంటే కంపెనీల ప్ర‌తినిధులు ముందుగా ప్ర‌భుత్వ స‌హ‌కారం, ఆ త‌రువాత మ్యాన్ ప‌వ‌ర్ కోసం ఆలోచిస్తారు. కొత్త రాష్ట్ర‌మైన ఏపీలో ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉన్నా.. మ్యాన్ ప‌వ‌ర్ దొర‌క‌డం క‌ష్టం. అలా అని వాళ్లు ల‌క్ష‌ల‌కోట్లు వెచ్చించి కంపెనీలు ఏర్పాటుచేసి ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల‌ను ఇక్క‌డ‌కు తీసురావ‌డం క‌ష్ట‌మైనప‌నే. దీంతో ఐటీ, నాన్ ఐటీ రంగాల‌కు చెందిన కంపెనీలు అన్నిసౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై వంటి రాష్ట్రాల్లో త‌మ కంపెనీల‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే, చంద్ర‌బాబు తీసుకున్న తాజా నిర్ణ‌యం ద్వారా కంపెనీల నిర్వాహ‌కులు ఏపీలో ల‌క్ష‌ల‌కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి. 

స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించిన డేటా ప్ర‌కారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎల‌క్ట్రిక‌ల్ విభాగం వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఐటీ రంగంలో ప‌నిచేస్తున్న‌వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఇలా ఇత‌ర రంగాల్లో ఏ విభాగంలో ఎంత‌మంది ఉన్నారు..? వారు ఎక్క‌డెక్క‌డ ప‌నిచేస్తున్నార‌నే విష‌యాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్ర‌తినిధుల ముందుఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబ‌డులు పెడితే ప్ర‌భుత్వం నుంచి మీకు అన్ని విధాల స‌హ‌కారం అందించ‌డంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తుంది. మీరు మంచి జీత భ‌త్యాలు ఇవ్వ‌గ‌లిగితే ఇత‌ర రాష్ట్రాల్లో  దేశాల్లో ఆయా విభాగాల్లో ప‌నిచేస్తున్న వారు స్వ‌రాష్ట్రానికి వ‌చ్చి ఉద్యోగం చేసుకుంటారు. అంతే కాదు..   ప్ర‌స్తుతం శిక్ష‌ణ పొందుతున్న వారుకూడా ఉన్నార‌ని ప్ర‌భుత్వం కంపెనీల ప్ర‌తినిధుల‌కు తెలియ‌జేస్తుంది. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టే ఏ కంపెనీ నిర్వాహ‌కుల‌కైనా ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారంతోపాటు, వారికి కావాల్సిన విభాగాల్లో ఉద్యోగ‌స్తులు అందుబాటులో ఉన్నారంటే అంత‌క‌న్నా కావాల్సింది మ‌రొక‌టి ఉండ‌దు. దీంతో పాటు ఇత‌ర రాష్ట్రాలు, ఇత‌ర దేశాల‌కు వెళ్లి 50వేల నుంచి ల‌క్ష జీతంతో ఉద్యోగం చేస్తున్న వారు సొంత రాష్ట్రంలో అదే జీతంతో ఉద్యోగం దొరుకుతుందంటే త‌ప్ప‌కుండా స్వ‌రాష్ట్రానికి వ‌చ్చేస్తారు. ఇలా చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐదో సంత‌కం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క భూమిక పోషించ‌బోతున్నది. ఒక‌ విధంగా చెప్పాలంటే.. బీసీ జ‌న‌ గ‌ణ‌న కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది. బీసీ జ‌న‌గ‌ణ‌న అనేది రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేసేది.. స్కిల్ సెన్సెస్ అనేది యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేది. మొత్తానికి చంద్ర‌బాబు నాయుడు అమ‌ల్లోకి తీసుకురాబోతున్న స్కిల్‌ సెన్సెస్ కార్య‌క్ర‌మం దేశానికే ఆదర్శంగా  మార‌బోతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.