బీజేపీ వనంలోకి వైసీపీ రోజా?

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..?  మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అధికార మ‌దంతో కొంద‌రు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బూతుల‌తో దండ‌యాత్ర చేశారు.

చంద్ర‌బాబు ఫ్యామిలీని సైతం వ‌ద‌ల్లేదు. భువ‌నేశ్వ‌రితో పాటు నారా లోకేశ్‌, బాల‌కృష్ణ వంటి నేత‌ల‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నాం.. మ‌న‌ల్ని ఎవ‌రూ ఏమీ చెయ్య‌లేర‌న్న అహంతో  విర్రవీగారు. మొద‌టి నుంచి వీరి ప్ర‌వ‌ర్త‌న‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తూ వ‌చ్చిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా దిమ్మ‌ తిరిగే షాకిచ్చారు. గ‌త ఐదేళ్ల కాలంలో బూతుల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై రెచ్చిపోయిన నేత‌లంద‌రూ ఓట‌మి పాల‌య్యారు. తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేత‌ల‌పై ఇష్టారీతిలో వ్యాఖ్య‌లు చేసిన వారిని వ‌దిలేది లేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దీంతో అధికారంలో ఉన్న‌ప్పుడు బూతుల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై రెచ్చిపోయిన వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఈ క్ర‌మంలో కొంద‌రు నేత‌లు వైసీపీని వీడి సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు  పెట్టారు. 

  సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, దేశంలోని ఎన్డీయే ప‌క్ష పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, మోదీల మ‌ధ్య అనుబంధాన్ని చూసిన వైసీపీ నేత‌లు రాబోయే రోజుల్లో వైసీపీకి గ‌డ్డుకాల‌మేన‌న్న నిర్థారణకు వచ్చేశారు.   అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ పై బూతుల‌తో రెచ్చిపోయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆర్కే రోజా, అంబ‌టి రాంబాబు, అనిల్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అరాచకాల కారణంగా   త‌మ అరెస్ట్ ఖాయ‌మ‌ని వారు భావిస్తున్నార‌ట‌.

చంద్ర‌బాబు యాక్ష‌న్‌లోకి దిగ‌క‌ముందే వైసీపీని వీడి సేఫ్ జోన్‌లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో ఆర్కే రోజా ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. చంద్రబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రోజాపై తెలుగుదేశం నేత‌ల‌తో పాటు జ‌న‌సేన నేత‌లుసైతం ఆగ్ర‌హంతో ఉన్నారు. 

తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఆర్కే రోజా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. ఆమె చెన్నై వెళ్లారా?  బెంగ‌ళూరు వెళ్లారా అనే విష‌యంపైనా స్పష్ట‌త లేదు. పోలింగ్ రోజే రోజా తన ఓటమిని అంగీకరించేసి, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ప్రారంభ‌మైన కొద్ది గంట‌ల‌కే  ఓటమి తథ్యమని అర్థం చేసుకుని రోజా అక్క‌డి నుండి వెళ్లిపోయారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోజా అజ్ఞాత వాసం చేస్తున్నారు.  వైసీపీని వీడి సేఫ్ పార్టీలోకి చేరలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.   రోజాకు తెలుగుదేశం, జనసేన తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే.  అందుకే ఆమె కమలం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే  మూడో సారి ప్రధానిగా మోడీ  ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు అభినందనలు తెలుపుతూ రోజా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ల ద్వారా బీజేపీ వర్గాలతో టచ్ లోకి వెళ్లి ఆ పార్టీ గూటికి చేరాలని ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితేఅవేమంత ఫలించే అవకాశాలు పెద్దగా లేవనీ అంటున్నారు. మొత్తం మీద రోజా వైసీపీకి సాధ్యమైనంత దూరం జరిగితేనే తనకు సేఫ్ అని భావిస్తున్నారన్నది మాత్రం వాస్తవం.