అవినాష్, సీబీఐ దాగుడు మూతలాట.. యింకెంత కాలం?
posted on May 1, 2023 @ 9:41AM
తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసు విచారణ జరుగుతోంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. మరుసటి రోజు నుంచి కోర్టుకు సెలవలు. ఆ ఒక్కరోజు గడిస్తే చాలు. అవినాషన్నకు నెలరోజుల ఊరట. మరి హైకోర్టు అవినాష్‌రెడ్డికి ఊరటనిస్తుందా? లేదా? పులివెందుల మర్డర్ ఆటను బీజేపీ ఇంకెన్నాళ్లు ఆడుతుంది? అలాగైతే మరి బీజేపీ బద్నామ్ కాదా? అవినాష్ అరెస్టుకు దారులున్నీ మూసుకుపోయేలా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలుపై విచారణను వాయిదా వేస్తూ పేర్కొన్న మాటలకు ముందు వరకూ ఉన్న పరిస్థితి.
అవినాష్ అరెస్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి రోజులు గడుస్తున్నా... సీబీఐ బృందాలు కపడ జిల్లాలోనే మకాం వేసి కూడా అవినాష్ దరిదాపులకు కూడా వెళ్ల కుండా దాగుడుమూతలు ఆడటం దేనికి సంకేతం. అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ తీరును రాష్ట్రంలోని అన్ని వర్గాలూ తప్పుపడుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రమే కాదు.. సామాన్య జనం కూడా సీబీఐ అవినాష్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును, ఆయన అరెస్టు విషయంలో వ్యవహరిస్తున్న తాత్సార వైఖరినీ తప్పుపడుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై రఘురామరాజు, కొలికిపూడి చేస్తున్న విమర్శలు, వేస్తున్న సెటైర్లు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. కడప ఎంపి, సీఎం జగన్ సోదరుడైన అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ అనుసరిస్తున్న తీరు తెలుగు టీవీ సీరియల్స్ ను మించి లాగ్ అవుతోంది.
అసలు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సీబీఐ అవినాష్ ను విచారిస్తోందా? లేక మీడియా సమావేశాలు, సెల్ఫీ వీడియోలతో విచారణ ఎలా చేయాలో అవినాష్ రెడ్డి సీబీఐకి చెబుతున్నారా? అన్న సందేహం ఎవరికైనా సహజంగా వస్తుంది. కోర్టులు విస్పష్టంగా సీబీఐ నుంచి అవినాష్ కు ఎటువంటి రక్షణా లేదని తేటతెల్లం చేసేశాయి. కోర్టులో అవినాష్ ను అరెస్టు చేస్తామని సీబీఐ కూడా చెప్పేసింది. అయినా ఆ అరెస్టు కార్యరూపం దాల్చక పోవడంతో సీబీఐయే అవినాష్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షిస్తోందా అన్న అనుమానం సామాన్యులలో కూడా వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది.
నిజానికి.. యిప్పుడు అవినాష్ ను అరెస్టు చేయడానికి సీబీఐకి ఎలాంటి అడ్డంకులూ లేవు. అయినా సీబీఐ అడుగు ముందుకు పడటం లేదు. అసలు వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ మొదటి నుంచీ ఒక విచిత్ర వైఖరినే అనుసరిస్తూ వచ్చింది. వస్తోంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో తనకు చిత్తం వచ్చినట్లే ముందుకు సాగిందన్న ఆరోపణలు సీబీఐ పై ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పడు దర్యాప్తు అంటూ హడావుడి చేయడం.. ఆ తరువాత నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండటం ఈ నాలుగేళ్లలో సీబీఐ దర్యాప్తు సాగిన తీరిది. అనినాష్ అరెస్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ యిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసిన తరువాత కూడా ముందస్తు బెయిలుపై తీర్పు కోసం సీబీఐ అరెస్టును ఆపినప్పుడే సర్వత్రా అనుమానాలు వ్యక్త మయ్యాయి.
ఏదో అదృశ్య శక్తి సీబీఐ కళ్లేలను తన చేతుల్లో ఉంచుకుందా అన్న సందేహాలూ వ్యక్త మయ్యాయి. చివరాఖరికి తెలంగాణ హై కోర్టు కూడా స్వయంగా సీబీఐ అనినాష్ ను అరెస్టు చేయాలనుకుంటే చేయవచ్చని విస్పష్టంగా చెప్పేసిన తరువాత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ మీనమేషాలు లెక్కిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ కాంగ్రెస్ పంజరంలోని చిలక అని దేశ సర్వోన్నత న్యాయస్థానమే అంది. ఇప్పుడు కాంగ్రెస్ బదులు బీజేపీ అనుకుంటే సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.