బాబు, పవన్ భేటీ.. పొత్తులపై పాత చర్చే మళ్లీ కొత్తగా తెరపైకి!
posted on May 1, 2023 @ 9:50AM
తెలుగుదేశం అధినేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వారి భేటీ సాగింది. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరూ సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్... ఇటీవలే ఢిల్లీ వెళ్లి భాజపా అగ్రనాయకత్వంతో నూ చర్చలు జరిపారు.
ప్రపంచ దేశాల్లో భారత్ ను బలమైన శక్తిగా నిలిపేందుకు, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ఆయన ప్రతిపాదించిన విజన్ 2047కి సంపూర్ణ మద్దతిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏలో చేరబోతు న్నారా? అని ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు... చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకపోయినా, మోడీ పట్ల సానుకూలతను మాత్రం సందేహాలకు అతీతంగా వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో జరిగిన చంద్రబాబు, పవన్ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చర్చించిన అంశాలపై వారిద్దరూ విలేకరుల సమావేశం నిర్వహించలేదు. రెండు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలూ వెలువడలేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడటంతో పాటు, రాజకీయంగా పొత్తులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు.
తెలంగాణతో పాటే... ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... చంద్రబాబు, పవన్ ల భేటీ అసక్తిగా మారింది. వారిద్దరూ ఏ అంశాలు మాట్లాడుకుని ఉంటారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై తమ విధానం ఏంటన్నది దిల్లీలోని భాజపా అగ్రనాయకత్వం ఇప్పటివరకు బయట పెట్టలేదు. మోడీ విధానాల్ని చంద్ర బాబు బహిరంగంగా సమర్ధించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వబోనని పవన్ పదే పదే చెబుతుండటంతో.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
వైకాపా ప్రభుత్వ అరాచకాలపై కలసి పోరాడాలని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య రాజ కీయ పొత్తును బలోపేతం చేసే దిశగా, ఇద్దరు నాయకుల మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరగనున్నట్టు రెండు పార్టీల శ్రేణులూ అభిప్రాయపడుతున్నాయి. మోడీని చంద్రబాబు ప్రశంసించడం చూస్తే.. ఆయన ఎన్డీఏలో చేరవచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. అదే నిజమైతే మోడీ ఈ విషయంలో చంద్రబాబు.. మైనార్టీలను ఏ విధంగా సమాధాన పరుస్తారన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు, పవన్ బేటీ రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై పాత చర్చనే మరోసారి కొత్తగా తెరమీదకు తెచ్చింది.