ధర్మానలో ఫ్రస్ట్రేషన్ పీక్స్!.. ఆయన కథ క్లైమాక్స్ కు చేరినట్లేనా?
posted on May 1, 2023 9:05AM
ఆడలేక మద్దెలు ఓడన్నట్లు.. ప్రజల సమస్యలు పరిష్కరించడం చాతకాక వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రజలను తప్పుపడుతున్నారు. ప్రజాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్లు, జూనియర్లు అన్న తేడా కనిపించడం లేదు. కట్టు తెంచుకుని వరద నీరు పోటెత్తినట్లు.. వైసీపీ నేతల్లో అసహనం బట్టబయలౌతోంది.
తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏకంగా వైసీపీ పాలన నచ్చితేనే ఓటేయండి లేకపోతే అక్కర్లేదు అంటే జనంపైనే తన అసహనం వ్యక్తం చేశారు. జనానికి మేలు చేసిన ప్రభుత్వం మాది.. మేం మేలు చేయడం వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని మీరనుకుంటే మీ యిష్టం అనేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ సర్కార్ కు తీవ్ర నష్టం చేయడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ఆయనను సైకో అంటూ విమర్శించడమేంటంటూ విపక్షాల మీద విరుచుకుపడిన మంత్రి ధర్మాన.. అదే జోరులో ప్రజలనూ చెడామడా చెరిగేశారు.
విపక్షం సభలకు జనం పోటెత్తడాన్ని, జగన్ సహా వైసీపీ సభలు జనం లేక వెలవెలబోవడాన్నీ తట్టుకోలేక తన అసహనాన్నంతా వెల్లగక్కేశారు. జనం మేలు కోసం మంచి పనులెన్నో చేస్తున్నారనీ జగన్ నిజంగా సైకో అయితే ప్రజల పథకాలు ఎందుకు అమలు చేస్తారనీ జనాన్ని నిలదీస్తున్నారు. ప్రజల కోసం అహర్నిశలూ కాపాడుతున్న జగన్ మీద అభిమానం ఉంటే ఓట్లు వేయండి లేకపోతే మానేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అన్ని వర్గాలలోనూ ధర్మాన వాచాలత పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. ధర్మాన లాంటి సీనియర్ నాయకుడు, మంత్రి అలా మాట్లాడటమేంటని వైసీపీ వర్గాలే గింజుకుంటున్నాయి.
అంతే కాదు.. ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల సభలకు, సమావేశాలకు జనం మొహంచాటేయడాన్ని కూడా ధర్మాన ప్రస్తావించారు. ప్రజల మంచి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం పట్ల ప్రజలు స్పందించే తీరిదేనా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. సొమ్ములు మీ ఖాతాల్లో వేస్తున్నా.. సంతృప్తి లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్లే రాష్ట్రం ఆర్థికంగా క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందనీ, ఫ్లై ఓవర్లు కట్టడానికి, అభివృద్ధి పనులు చేయడానికీ కూడా సొమ్ములు లేని పరిస్థితి వచ్చిందనీ ధర్మాన చెబుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారంటే.. అందుకు జగన్ ప్రభుత్వమే కారణమనీ, అలాంటి జగన్ ప్రసంగిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలన్న మంచి హృదయం కూడా జనానికి నేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
టీవీలలో ఏం చెబితే అది నమ్మేయడమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను సంతోషంగా ఉంచేందుకు పథకాలను అమలు చేయడమే జగన్ సర్కార్ చేసిన నేరమా, అలా చేయడమంటే రాష్ట్రాన్ని తగలెట్టేయడమేనా అని ధర్మాన ప్రజలను నిలదీశారు. అంతే కాదు.. తమ సమస్యలను విన్నవించుకున్న వారిపై సైతం ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కరోనా క్వారంటైన్ బాధితుల కోసం ఉపయోగించిన టాయిలెట్లను కనీసం క్లీన్ చేయకుండా అప్పగిస్తున్నారంటూ ఓ లబ్ధి దారులు ధర్మాన దృష్టికి తీసుుక వస్తే.. లక్షల గృహాలిచ్చాం.. ఆ మాత్రం టాయిలెట్లను క్లీన్ చేసుకోలేరా అని ఎదురు ప్రశ్నించి నోరుమూయించేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద ధర్మాన తీరు.. ఆయనలో పేరుకు పోయిన ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.