కీలకమైన వాంగ్మూలాలు.. సమరానికి సై అంటున్న సీఎంలు
posted on Jun 18, 2015 @ 10:56AM
ఓవైపు స్టీఫెన్ సన్ వాంగ్మూలం.. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం వల్ల నోటుకు ఓటు కేసులో ఏలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపన్ సన్ వాంగ్మూలాన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో నమోదు చేసుకున్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలం బట్టి తను చెప్పే పేర్లను బట్టి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో "చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని, చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని.. కోటీ రూపాయలు స్టీఫెన్ సన్ దగ్గర తీసుకొని కేసీఆర్ తనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చారని"... విజయవాడలో మేజిస్ట్రేట్ ముందు మత్తయ్య తన వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఏపీ సీఐడీ ఈకేసు దర్యాప్తును ముమ్మరం చేసి మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటాపోటీగా నోటీసులు జారీ చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా వాళ్లు నోటీసులు పంపిస్తే మనం నోటీసులు పంపిద్దాం.. వాళ్లు కేసు పెడితే మనం కూడా కేసు పెడదాం.. అంటూ ఏపీ అధికారులకు ముందే తేల్చి చెప్పారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏ ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టకుండా ఎలాగైనా చంద్రబాబును ఇరికించాలని పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంది. దీంతో రెండు రాష్ట్రాలు సై అంటే సై అనే పరిస్థితికి వచ్చాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నువ్వా నేనా అని తేల్చుకునే పరిస్థితికి వచ్చారు.