ప్రజ్ణా ఠాకూరు విద్వేష ప్రసంగం.. చర్య తీసుకోవాలంటూ మాజీ బ్యూరోక్రాట్ల లేఖ
posted on Jan 9, 2023 5:59AM
నిత్యం వివాదాలలో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ణా ఠాకూర్ మరో సారి వార్తల్లో నిలిచారు. విద్వేష ప్రసంగాల విషయంలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ వంద మందికిపైగా మాజీ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన సాధ్వీ ప్రజ్ణాసింగ్ కు ఎంపీగా కొనసాగే అర్హత లేదంటూ ఆ లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు. ఆమెపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.
103 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరటం కర్నాటక, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్ గత ఏడాది డిసెంబర్ 25న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హిందూ జాగరణ్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ ప్రాంతీయ విభాగం వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ తమను తాము రక్షించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నందున హిందూవులు తమ ఇళ్లలో కత్తులకు పదును పెట్టుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ నేపథ్యంలోనే మాజీ బ్యూరోక్రాట్లు ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. అంతకు ముందు కూడా పలుమార్లు సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 మేలో కర్నాటకలో హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన గాడ్సే జయంతి వేడుకలలో సాధ్వీ ప్రజ్ణాసింగ్ పాల్గొన్నారు. గాడ్సేకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడంటూ సాధ్వీ ప్రజ్ణాసింగ్ ఆ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో ప్రధాని మోడీ ప్రజ్ణాసింగ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం క్షమార్హం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హిందువులు ఆయుధం పట్టాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మాజీ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎస్పీ ఆంబ్రోస్ , ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్, ఐపీఎస్ మాజీ అధికారి ఎ.ఎస్. దులత్ తదితరులు ఉన్నారు.