అటా ..ఇటా, బీజేపీ ఎటు?
posted on Jan 9, 2023 @ 2:12PM
భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ అని, ఆపార్టీ నాయకులు చెప్పే మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటే ఉండవచ్చును. కానీ, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో ఆ పార్టీకి ‘సూది’ మొనంత చోటు కూడా లేదు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 0.5 శాతమో ఏమో ఓట్లు పోలయ్యాయి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా ప్రాతినిధ్యం అన్నదే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ పోషించే పాత్ర ఆటలో అరటి పండు పాత్ర.
అయినా రాష్ట్ర రాజకీయాల్లో కాషాయ పార్టీ మనుగడ సాగిస్తోందంటే అందుకు కేంద్రంలో ఉన్న అధికారమే కారణం. ఆ కారణంగానే, ఎలక్టోరల్ కాలేజీలో సింగిల్ ఓటు లేక పోయినా రాష్ట్ర పతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు ఒక్క ఓటు బీరు పోకుండా నూటికి నూరు శాతం ఓట్లు పోలయ్యాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు రాష్ట్రపతి ఎన్నికలలో బీజీపేకి జై కొట్టారు. అలాగే రాజ్యసభలో ఏపీ సభ్యులు పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ అనుబంధ సభ్యులా అన్నట్లుగా వ్యహరిస్తున్నారు. అలాగని వైసేపీ, టీడీపీ పార్టీలు బీజేపీ మిత్ర పక్షాలా అంటే, లేదు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు రెండూ బీజేపీ మిత్ర పక్షాలు కాదు, కానీ కాదనీ చెప్పలేము. కారణాలు వేరు కావచ్చును కానీ, రాష్ట్రంలో 0.5 శాతం మాత్రమే ఓటున్న పార్టీకి 95 శాతానికి పైగా ఓటును షేర్ చేసుకునే అధికార ప్రతిపక్షాలు రెండూ, ఏ ఫ్రిండ్ ఇన్ నీడ్ .. అన్నట్లుగా అవసరానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్నాయి.
అంతే కాదు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీ చెలిమిని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి.ఇక ఏపీ రాజకీయాల్లో మూడో ప్రధాన పార్టీ జనసేన నేరుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతానికి బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతోంది. అయితే ఇది ఇంతవరకు ఉన్న పరిస్థితి..కానీ, ఆదివారం(జనవరి 8) తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో రాష్ట్ర రాజకీయాలలో,ముఖ్యంగా పొత్తులకు సంబందించి ఇంతవరకు ఉన్న అనుమానాలు చాలా వరకు తొలిగి పోయాయి. చాలా వరకు క్లారిటీ వచ్చింది. తెలుగు దేశం, జనసేన మధ్య సీట్ల పంపకం వరకు పొత్తులు ఫైనలైజ్ అయినట్లు వస్తున్న ఉహాగానాల్లో నిజం వుందో లేదో కానీ, రెండు పార్టీలు, ఇద్దరు నేతల మధ్య పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన అయితే కుదిరిందని గట్టిగానే వినిపిస్తోంది.
అయితే, ఇప్పడు బీజేపీ ఏమి చేస్తుంది, ఎటు వైపు మొగ్గు చూపుతుంది అనేది మరో మారు ఆసక్తికరంగా మారింది. నిజానికి, ఇంతకు ముందే అనుకున్నట్లుగా ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. అయినా, అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని.. రక్తపాతం సృష్టిస్తారని ఇలాంటి పరిస్థితులు ఉండకూడదంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలకం అని టీడీపీ, జనసేన సహా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కాగా, జగన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా, జీఓ 1 తో విపక్షాల కాళ్ళు చేతులు కట్టేసిన నేపధ్యంలో కేంద్రంలో అధికారంలో ఉండడం అనే ఒకే ఒక్క కారణంతో బీజేపీ అవసరం ప్రతిపక్షాలకు వుందని, అందుకే ఆ విషయం చర్చించేందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబును కలిశారని అంటున్నారు.భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపు నిచ్చారు.చంద్రబాబుతో చర్చిన విషయాలను మా మిత్ర పక్షం ( బీజేపీ) నాయకులతోనూ చర్చిస్తానని చెప్పారు.
అయితే తెలుగు దేశం, జనసేన కూటమితో చేతులు కలిపేందుకు బీజేపీ అంగీకరిస్తుందా? అంటే, నిజానికి బీజేపీ ముందు మరో ఆప్షన్ లేదని అంటున్నారు. అంతేకాదు, పవన్ ద్వారా బీజేపీనే చంద్రబాబుతో రాయబారం నడిపిందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్’లో వినిపిస్తోంది. వైసీపీతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధాలు పొత్తులు పెట్టుకునే పరిస్థితి లేదు, వైసీపీ, సింహం సింగిల్ గానే వెళుతుందని, ప్రకటించింది. కాబట్టి బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు అవకాశంలేదు పరోక్ష పొత్తులే పెట్టుకోవాలి. అదే టీడీపీ అయితే రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా వుంది. సో.. చివరాఖరుకి, 2014లో లాగా, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.
అయితే, అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా అయితే వుంది. 2014లో జనసేన టీడీపీ, బీజేపీ కి మద్దతు మాత్రమే ఇచ్చింది. బరిలో దిగలేదు. పోటీ చేయలేదు,, 2024లో బరిలో దిగుతుంది ..పోటీలో ఉంటుంది .. అదొక్కటే తేడా ముగిలినదంతా సేమ్ టూ సేమ్ అంటున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం జనసేన విడాకులు ఇచ్చినా బీజేపీ ఒంటరిగానే వెళుతుందని, అంటున్నారు. అయితే, బీజేపే నిర్ణయం విషయం పక్కన పెడితే చివరకు టీడీపీ, జనసేన కలసి నడవడం మాత్రం ఖరారైందని, అందరూ అంటున్నారు.