బ్రదర్ అనిల్ వదిలిన బాణం?
posted on Feb 21, 2021 @ 1:28PM
అప్పుడు షర్మిల జగనన్న సంధించిన బాణం ... అన్న జైలుకు పోతే ఆమె అన్న పాదుకల్లో కాలుపెట్టారు. ఆయన ప్రారంభించిన పాద యాత్రను కొనసాగించారు. నిజానికి జగన్ కంటే షర్మిలే ఎక్కువదూరం,(మూడు వేల పై చిలుకు కిలోమీటర్లు)నడిచారు. జైల్లో జగన్ ఏ కష్టాలు పడ్డారో ... ఏ సుఖాలు అనుభవిఇంచారో ఏమో గానీ, పాదయాత్రలో షర్మిల పడరాని పాట్లు పడ్డారు. ఆయన జైలులో ఉన్న 16 నెలలు రాజన్న రాజకీయ వారసత్వాన్ని సజీవంగా నిలిపారు. ఒక విధంగా ఆ సమయంలో ఆమె వైసీపీని బతికించారు. వైసీపీ ప్రస్థానంలో అంతకు ముందు ఆ తర్వాత పార్టీని నడిపించడం ఒకెత్తు అయితే, ఆ 16 నెలలు పార్టీని సజీవంగా ఉంచడం ఒక్కటీ ఒకెత్తు. ఆ సమయంలో వైసీపీ ప్రస్థానానికి బ్రేకులు పడి ఉంటే పార్టీ ప్రస్తుత స్థిలో ఉండేది కాదు.ఇది ఎవరు కాదనలేని నిజం.
అప్పట్లో షర్మిలను నడిపించింది కేవలం రక్తబంధమేనా,లేక ఇంకేమైనా లౌకిక, అలౌకిక బంధాలు ఉన్నాయా? అంటే నిజానిజాలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే పదవులవిషయంలో రాజకీయ ప్రాధాన్యత విషయంలో జగన్ ఇచ్చినమాట తప్పడం వల్లనే షర్మిల ఇప్పుడు ఇలాంటి నిర్ణయానికి వచ్చారని కొందరు చెపుతున్నారు. అలాగే ఆమె ఇప్పుడు ఒక్కసారిగా తమ రాజకీయ ఆకాంక్షను బయట పెట్టడంతో ఎన్నెన్నో ప్రశ్నలు, ఇంకెన్నో సందేహలు బాణాల్లా దుసుకోస్తున్నాయి. మరోవంక ఆమె ఎవరు వదిలిన బాణం అనే చిక్కు ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతోంది. షర్మిల తాజా నిర్ణయం రాజకీయ, రాజకేయేతర ఊహాగానలకు తావిస్తోంది.
అంతే కాదు ఈ ప్రశ్న మూలాలు ఇంకెక్కడో ఉన్నాయన్న అనుమానాలు వినవస్తున్నాయి.
రాష్ట్రాల సరిహద్దులు, దేశాల సరిహద్దులుదాటి ఏ జెరూసలంలోనో ఇంకెక్కడో షర్మిల రాజకీయ ఆకాంక్షల వేళ్ళు తేలుతున్నాయి. అందుకే కావచ్చు సామాజిక మాధ్యమాలలో కొందరు ఇది ఏసు ప్రభువు సంకల్పం, జేరూసలం ఆజ్ఞ అంటున్నారు. భర్త బ్రదర్ అనీల్ ఆదేశం.. అప్పుడు ఒక సోదరిగా జగన్ జగన్ కోసం ముందుకొచ్చి పాదయాత్ర చేసిన షర్మిల, ఇప్పడు భర్త అనీల్ కోసం మరో సారి రాజకీయ వేదిక మీదకు వచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. దీంతో ఆమె ఎవరు సంధించిన బాణం అనే విషయంలో చాలా చాలా కథలు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకరు ఆమెకు అన్నజగన్ కు మధ్య ఆస్తి తగాదాలతో పాటుగా రాజకీయ వారసత్వ తగవులు, తగాదాలు ఏవో ఉన్నాయని అంటారు. ఇంకొందరు అబ్బే అదేమీ కాదు.. అలా అయితే ఆమె తిరుగుబాటు జెండా ఏపీలో ఎగరేయాలిగానీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఎగరేస్తారు అంటూ లాజిక్ లాగుతున్నారు. కేసీఆర్, జగన్, షర్మిల ముగ్గురినీ కలిపి ట్రైయాంగిల్ పొలిటికల్ స్టొరీ తెరమీదకు తెచ్చారు ఇంకొందరు.
తెరాసకు ఇటీవల వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కారు 16 అంటే అది కాస్త సగానికి పడిపోయింది.అది ఎప్పటి సంగతో అనుకున్నా , నిన్నమొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఘాట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు చోట్ల విజయం సాధించిన బీజేపీలో జోష్ పెరిగింది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాంగ్రెస్ ’లోనూ కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి పదివి తప్ప ఇక దేనితోనూ కాంప్రమైజ్’ కాని గడుసుపిండం రేవంత్ రెడ్డి యాత్రాలతో ఉప్పెన సృష్టిస్తున్నారు.మరో వంక ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు బారులు తీరిన ఎన్నికలు భయపెడుతున్నాయి.ఈనేపధ్యంలోకేసీఆర్, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు,అంతకంటే ముఖ్యంగా చల్లారిన తెలంగాణ సెంటిమెంట్ ను వేడెక్కించేందుకు వ్యూహాత్మకంగా జగన్ తో కలిసి షర్మిలను తెరమీదకు తెచ్చారు అనే కథొకటి కూడా సర్క్యులేషన్’లో ఉంది. తెర వెనక ఉంది బీజేపీనే అనే కథనం మరొకటి కూడా అక్కడక్కడా వినవస్తోంది.
అయితే ఇందులో ఏది నిజం, ఏది కట్టు కథ అంటే ... చెప్పడం కొంచెం కష్టమే.కానీ కొద్దిగా విశ్లేషించి చూస్తే మాత్రం పైకి కనిపిస్తున్న,వినిపిస్తున్నకథలు, కథనాల కంటే, కనిపించని, నాలుగో సింహం ఇంకొకటి ఎదో ఉందని అనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డ్డి కుమార్తె, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి మాత్రమే కాదు.. ఆమె బ్రదర్ అనీల్ భార్య అనే విషయాన్ని మరిచి పోకూడదు. నిజానికి, ఆమె ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తెలంగాణ తనకు మెట్టినిల్లని సమాధానం ఇచ్చారు.అంటే వైసీపీ పుట్టింటి పార్టీ అయితే ఇప్పుడ పెట్టబోయే పార్టీ అత్తింటి పార్టీ అనుకోవచ్చును.ఇక్కడే షర్మిల చేత కొత్తగా రాజకీయ అడుగులు వేయిస్తున్నది బ్రదర్ అనీల్ అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొందరు బ్రదర్ షర్మిల అనీల్ వదిలిన బాణమని అంటున్నారు.
బ్రదర్ అనీల్ ఎవరో ... ఏమిటో .. ఆయన వృత్తి, ప్రవృత్తి,లక్ష్యం,గమ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. బ్రదర్ అనీల్ క్రైస్తవ ధర్మాన్ని నరనరాన నింపుకున్న పవిత్ర క్రైస్తవుడు. వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి ఇతర క్రైస్తవ రెడ్డి నాయకుల్లాగా బ్రదర్ అనీల్ లౌకికవాదం ముసుగులు కప్పుకోలేదు.ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీని గెలిపించింది కూడా ఏసు ప్రభువే అని గట్టిగా విశ్వసిస్తారు. క్రైస్తవ రాజ్య స్థాపన లక్ష్యంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా బహిరంగ మత ప్రచారం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు క్రైస్తవ సంబంధాలున్నాయి. అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలతో ఆర్థిక సంబంధాలూ ఉన్నాయి.అదీ గాక గతంలో ఎప్పుడూ షర్మిలతో కలిసి రాజకీయ వేదికల మీద కనిపించని బ్రదర్ అనీల్.. షర్మిల తాజా రాజకీయ ఆలోచన వేదిక మీద కనిపించడమే కాదు, కర్తః కర్మ క్రియ అన్నీ తానై కథ నడిపిస్తున్నారు. అంటే పార్టీ పెట్టేది షర్మిల అయినా.. పార్టీని నడిపించేది మాత్రం బ్రదర్ అనీల్ కుమార్ అనేది ఇప్పటికే చాలా వరకు స్పష్టమైంది. సో ... షర్మిలను వెనకుండి నడిపిస్తున్నది కేసీఆర్ కావచ్చు,జగన్ కావచ్చు, కాదంటే మరొకరు ఎవరైనా కావచ్చును.. కానీ ముందుండి దారి చూపుతున్నది,మార్గదర్శనం చేస్తున్నది మాత్రం బ్రదర్ అనీల్ ... అందులో సందేహం లేదు. అందుకే షర్మిల పేరున సాగుతున్న రాజకీయ వేదిక నిర్మాణం బ్రదర్ అనీల్ కుమార్’ ఆశయాల సాధనకోసం, అంటే క్రైస్తవ రాజ్య స్థాపన కోసం కావచ్చు కదా అని కొందరి అనుమానం..