తెలంగాణ సీఎం బఫూన్! బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
posted on Feb 21, 2021 @ 3:06PM
ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను బఫూన్లు పరిపాలిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పోలీసులు రాష్ట్రంలో రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్ లతో పాస్ పోర్టులు ఇస్తున్నారని తెలిపారు.
హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో కూడా తెలియదని మండిపడ్డారు ధర్మపురి అర్వింద్. మయన్మార్ లో వందలాది హిందువులను వధించిన రోహింగ్యాలు దేశభద్రతకే సవాల్ గా మారారని చెప్పారు. భారత్ లో ప్రవేశించిన రోహింగ్యాలు ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని వివరించారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ రోహింగ్యాలపై ఎందుకు కూయడం లేదని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉండటం వెనుక ప్రభుత్వ పాత్ర కూడా ఉందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. కల్వకుంట్ల దోపిడి పాలనలో అప్పులమయంగా మారిందన్నారు ధర్మపురి అర్వింద్. ఆరున్నర ఏండ్లలోనే కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ కుటుంబం తోలు తీసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అరవింద్ స్పష్టం చేశారు.కేసీఆర్, కేటీఆర్ ల తోలు తీస్తామంటున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించడంలేదని విమర్శించారు.