బీజేపీలోకి రేవంత్ అనుచరుడు! తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
posted on Feb 21, 2021 @ 10:44AM
తెలంగాణలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన కూన శ్రీశైలం గౌడ్.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ వ్యవహారాలపై కొంత కాలంగా శ్రీశైలం గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం గౌడ్ మేడ్చల్ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
గ్రేటర్ పరిధిలో బలమైన నేతగా ఉన్నారు కూన శ్రీశైలం గౌడ్. కొంత కాలంగా ఎంపీ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా పోరాడారు. గ్రేటర్ పరిధిలో అంతో ఇంతో కాంగ్రెస్ బలంగా పోటీ ఇచ్చిన డివిజన్లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి గ్రేటర్ లో కుడి భుజంగా వ్యవహరించిన కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది.
2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కూన శ్రీశైలం. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. గత 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మేడ్చల్ జిల్లాకు చెందిన కొందరు నేతలతో కూనకు విభేదాలున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా ఆ వర్గం పని చేసిందని కూన బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.