బొత్స నోట వైసీపీ ఓటమి మాట!
posted on Nov 2, 2022 @ 11:39AM
వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని వైసీసీ ఇప్పటికే మానసికంగా ఫిక్సైపోయిందా? బొత్స మాటలు అలాగే ఉన్నాయి మరి. ఎలాగూ పరాజయం తప్పదు కనుక చేయగలిగినంత గందరగోళం చేసి పోవాలని భావిస్తోందా? వైసీపీ నేతలు, మంత్రుల మైండ్ సెట్ అలా ఫిక్సై పోయిందా? ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బొత్స నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారా? అన్ని ప్రజలకు చెప్పీ, వారి ఆమోదం పొంది చేయడం మావల్ల కాదు అని అనేందుకు సైతం సిద్ధపడటం వెనుక ఉన్న కారణం అదేనా? పరిశీలకులు మాత్రం బొత్స మాటల వెనుక మర్మం, ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఒక్క బొత్స అనే కాదు.. మంత్రి ధర్మాన ప్రసాదరావు.. చివరాఖరికి ముఖ్యమంత్రి జగన్ కూడా రాష్ట్రంలో విధ్వంసం, విచ్ఛిన్నం, విద్వేషం పెచ్చరిల్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ ప్రజల అభీష్టాన్ని, ఆకాంక్షలను కించపరుస్తున్నట్లుగా మాట్లాడారు.
ప్రభుత్వం ఏం అనుకుంటుందో అదే చేస్తుంది. అది తప్పయితే పెద్దగా జరిగేదేముంటుంది.. ఓడిపోతాం అంతే కదా అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటల ద్వారా ప్రజా శ్రేయస్సు, ప్రజాభీష్టం, ప్రజల ఆకాంక్షలు తమ సర్కార్ కు ఏ మాత్రం పట్టవని తాము తలచిందే చేస్తాం, మేం చేసిందే చట్టం అని చెప్పకనే చెప్పారు. ఒక సీనియర్ మంత్రిగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి ఈ వ్యాఖ్యల ద్వారా తాము ప్రజలకు ఎంత మాత్రం జవాబుదారీ తనంగా ఉండాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. తమ విధానాలు, కార్యక్రమాలు, పథకాలు జనానికి నచ్చక పోతే ఓటు వేయకుండా ఓడించండి.. అంతే కానీ ఇదేమిటి? ఎందుకిలా? ఇలా చేయండి వంటి మాటలు మాట్లాడద్దు, వినడానికి మేం సిద్ధంగా లేం అని ఒక విధంగా హెచ్చరిక చేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అంతకు ముందు మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం అసలు మూడు రాజధానుల గురించి ఆలోచించడమే లేదనీ.. రాష్ట్రానికి ఒకే రాజధాని అది విశాఖపట్నమేనని చెప్పారు. ఇలా చేప్పడం వెనుక రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలన్న ఉద్దేశమే ఉందని అంటున్నారు.
ఇప్పటి వరకూ మూడు రాజధానులంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మాత్రమే రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం వెనుక రాయలసీమలో అసంతృప్తి రగిలించాలన్న ఉద్దేశమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల పబ్బం గడుపుకుని లబ్ధి పొందాలన్న సంకుచిత రాజకీయ లక్ష్యంతోనే ధర్మాన ఆ రీతిగా మాట్లాడారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక జగన్ కూడా ఇదే రీతిన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజధాని అన్నది సీఎం ఇష్టమని కొత్త భాష్యం చెప్పారు. అంటే సీఎం పాలన ఎక్కడ నుంచి సాగించాలని అనుకుంటారో అదే రాష్ట్ర రాజధాని అవుతుందన్నారు.
అదెలాగంటే.. సీఎం ఎక్కడ ఉంటే మంత్రులు అక్కడే ఉండాలని, మంత్రులతో పాటే సచివాలయం కూడా అక్కడే ఉంటుందని.. దీనిలో వివాదమేముందని ప్రశ్నించారు. అంటే తాను విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్నందున ఆటోమేటిగ్గా విశాఖే రాజధాని అయిపోతుందని ఆయన మాటల అర్ధం. అంటే ఒక వేళ ప్రధాని మోడీ గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుంచి పాలన సాగించాలనుకుంటే.. దేశ రాజధాని ఢిల్లీ కాకుండా గాంధీనగర్ గా మార్చేయడం కుదురుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జగన్, బొత్స, ధర్మానల మాటల వెనుక ఉన్న మర్మం ఒక్కటే రాష్ట్రంలో ప్రాతీయ విద్వేషాలు పెచ్చరిల్లి.. శాంతి భద్రతల సమస్య సృష్టించడమే. అప్పుడు పోలీసులను రంగంలోకి దింపు అమరావతి రాజధాని అన్న మాట కూడా ఎక్కడా వినిపించకుండా ధిక్కార స్వరాలను అణగదొక్కేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.