మోడీతో పవన్ భేటీ.. కలిసి ర్యాలీ.. దేనికి సంకేతం?
posted on Nov 10, 2022 @ 10:53PM
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీల మధ్య గత కొంత కాలంగా అగాధం ఏర్పడిందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మోడీ, పవన్ ల భేటీ విశాఖలో జరగనుంది. అదే సమయంలో ఈ రెండు పార్టీల పొత్తుకు తోడు జనసేన తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్న సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు మెరుగయ్యాయని పరిశీలకులు అంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి అధికార పార్టీకి తప్ప బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా స్పష్టమైన సమాచారం లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ షో జరుగుతుందన్న స్పష్టత వచ్చింది. అన్నిటికీ మించి మోడీ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన వైసీపీ ఎంపీ విజయసాయి అత్యుత్సాహం బీజేపీనే కాదు.. ఏకంగా కేంద్రాన్ని ఇరుకున పడేసింది. మోడీ విశాఖ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తారంటే తన ట్విట్టర్ హ్యాండిల్ లో విజయసాయి చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో బీజేపీ ఇరుకున పడింది. దీంతో ఆఘమేఘాల మీద నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ఆ పార్టీ నాయకుడు జీవీఎల్ రంగంలోకి దిగారు. మోడీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారనీ, అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలనీ వివరించిన ఆయన మోడీ బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపే విధంగా రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. కాగా మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారనీ, ఇరువురూ కలిసే రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందనీ జీవీఎల్ పేర్కొన్నారు.
కాగా ఇప్పటి వరకూ మోడీ పర్యటనను పూర్తిగా వైసీపీ హైజాక్ చేసేసిందనీ, రాజకీయాలకు సంబంధం లేకుండా వైసీపీ పార్టీ రంగులతో వేసిన ఫ్లెక్సీలలో మోడీ ఫొటోను ప్రముఖంగా ఉంచడం ద్వారా ఏదో మోడీ వైసీపీ గూటికి చేరారా అన్నంతగా ప్రచారం చేసుకుంది. ఇది సహజంగానే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికీ రుచించలేదు. దీంతో బీజేపీ చురుగ్గా స్పందించి అప్పటి కప్పుడు మోడీ రోడ్ షోను ప్లాన్ చేసింది. ఏపీలో బీజేపీకి భారీ జనసమీకరణ చేసే బలం లేని కారణంగా మిత్ర పక్షం జనసేన అధినేతను ర్యాలీలో పాల్గొనేలా వ్యూహం పన్నింది. ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ తీరును కూడా ఒకటి రెండు సందర్భాలలో ఎండగట్టారు. మోడీ అంటే అపారమైన గౌరవం ఉందని చెబుతూనే బీజేపీ ఏపీ నాయకత్వం తీరుపై తీవ్రు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ మాత్రం పవన్ విమర్శలపై ఇసుమంతైనా స్పందించకుండా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పుకుంటూ వస్తోంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ ఆగ్రనేతలెవరూ పవన్ తో భేటీ అవ్వలేదు.
కానీ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్లింది. మోడీతో భేటీకి అప్పాయింట్ మెంట్ కూడా లభించింది. అంతే కాకుండా మోడీతో కలిసి రోడ్ షోలో పవన్ కూడా పాల్గొనేలా ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం అధినేతతో కూడా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ సఖ్యతగా ఉండటం.. తొలి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనంటూ గతంలో పవన్ చేసిన ప్రకటన బేరీజు వేసుకుని చూస్తే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాని పర్యటనను పూర్తిగా హైజాక్ చేసి.. తాము బీజేపీకి పూర్తి అనుకూలం అని చాటేందుకు శతథా ప్రయత్నించిన వైసీపీకి మోడీ పర్యటకు జనసేనానికి ఆహ్వానం పలకడం, మోడీతో పవన్ ప్రత్యేకంగా భేటీ అవుతుండటం, అలాగే మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొనే అవకాశాలుండటం కచ్చితంగా మింగుడు పడదని పరిశీలకులు అంటున్నారు. మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ఆహ్వానం ద్వారా వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చాటడమే బీజేపీ వ్యూహంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మోడీ, పవన్ భేటీ రాష్ట్ర రాజకీయాలలో మార్పునకు తొలి అడుగుగా భావించవచ్చని అంటున్నారు.