మునుగోడులోనూ మునక తప్పదా? కమలనాథుల్లో ఆందోళన
posted on Sep 7, 2022 @ 4:58PM
కమల వికాసం అంటూ బీజేపీ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. వ్యూహాలు తల్లకిందులౌతున్నాయి. స్వల్ప వ్యవధిలో బీహార్ లో, జార్ఖండ్ లో కమల వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ప్రభుత్వాలను పడగొట్టేందుకు చేసిన ప్రయోగాలు వికటించాయి. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వమే కూలిపోయింది, జార్ఖండ్ లో బీజేపీ పరువు గంగలో కలిసి నవ్వుల పాలైంది. ఇప్పుడు ఇక మునుగోడులో ఉప ఎన్నికను బలవంతంగా తీసుకు వచ్చిన ఆ పార్టీ ఎత్తుగడ అయినా ఫలిస్తుందా అంటే పరిశీలకులు ఏమో అనే అంటున్నారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కమల నాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది బిజెపి నాయకత్వం. అందులో భాగంగానే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక కు తెరలేచింది. అయితే, దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు.. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందో తెలియని పరిస్థితి. కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ప్రయోగాలు ఫలించి అధికారం దక్కడంతో బీహార్, ఢిల్లీ,ఝార్ఖండ్ రాష్ట్రాలలోనూ అదే ప్రయోగాన్ని అప్లై చేసిన కమలనథులకు శృంగభంగమైంది. ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు పరిపాలన సాగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చైనా సరే అధికారం దక్కించుకోవాలనే వ్యూహంతో ఇటీవల బీజేపీ పావులు కదపడం ఎక్కువైంది. ఓ రెండు రాష్ట్రాలలో (కర్నాటక, మహారాష్ట్ర) బీజేపీ వ్యూహాలు ఫలించి, ఎత్తుగడలు విజయవంతమైనా, ఆదే బాటలో మరో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సర్కార్ లను కూల్చేయడానికి బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి.
బీహార్ లో అయితే ఏకంగా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం కూలిపోయింది. జార్ఖండ్, ఢిల్లీలలో ప్రయోగం వికటించడమే కాకుండా బీజేపీ పరువు గంగలో కలిసింది. పార్టీ అగ్రనాయకత్వం నవ్వుల పాలైంది. డిల్లీ, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ పరువు బజారున పడటమే కాకుండా ప్రభుత్వాలు కూల్చడానికి కేంద్రం దుష్టపన్నాగాలు పన్నుతోందన్న అప్రదిష్ట మూటగట్టుకుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడు ఉపఎన్నిక ను బలవంతంగా ముందుకు తీసుకువచ్చి విజయం సాధించి ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ విజయాన్ని అలంబన చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఈ వ్యూహమైనా ఫలిస్తుందా అంటే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఎందుకంటే తెలంగాణలో ఇంకా చెప్పాలంటే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలంలేదనీ, మొత్తం తెరాస నుంచి కమలం గూటికి చేరి బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టపైనే బీజేపీ పూర్తిగా ఆధారపడిందనీ అంటున్నారు. అందుకే ఇక్కడ బీజేపీ గెలుపు ఎంత మాత్రం నల్లేరుమీద బండి నడక కాదంటున్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నిక పై ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సర్వేలలోనూ కమలం పార్టీ మూడో స్థానంలో ఉండటం, ఇక్కడ తెరాస, కాంగ్రెస్ ల మధ్యే పోరు ఉంటుందని సర్వేలు తేల్చేశాయి.
కర్ణాటకలో జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చడంలో.. మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని దింపడంలో మాత్రమే బీజేపీ వ్యూహం ఫలించింది, ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత వరుసగా బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు మునుగోడులో కూడా పరాభవం ఎదురైతే ఆ ప్రభావం తప్పని సరిగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందన్న ఆందోళన, భయం ఇప్పుడు కమలనాథుల్లో వ్యక్తం అవుతోంది.