బెజవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున?
posted on Sep 7, 2022 @ 5:55PM
రాజకీయాలకు సినీరంగానికి సంబంధాలు అనాదిగా ఉన్నదే. సినీహీరోలు, హీరోయిన్లు రాజకీయపార్టీ నాయకులతో ఉన్న స్నేహబంధం అనుసరించి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం జరుగుతూ వచ్చింది. కాలక్రమంలో పార్టీ నాయకులు సినీ ప్రముఖుల స్నేహాన్ని ఆశించడం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఈ మైత్రి ప్రభావం గురించిన చర్చలే వినవస్తున్నాయి. ఇటీవల అధికారంలో ఉన్న పార్టీలు కూడా విపక్షాలతో పోటీపడి మరీ సినీరంగ ప్రముఖులకు గాలం వేయడం జరుగుతోంది. ఈమధ్యనే బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లోని టాలీవుడ్ హీరోలకు గాలం వేయడానికి ప్రయత్నిం చారు. అందులో భాగంగానే అమిత్ షా ఎన్టీఆర్‌ను, నడ్డా నితిన్‌నీ కలిశారు. సమావేశాల ఫలితం ఎలా ఉన్నా యంగ్ హీరోల ప్రభావం ప్రజల మీద ఉంటుందన్న నమ్మకం వారిలో బలంగా నాటు కుంది. ఇలా నే ఏపీ సీఎం జగన్ కూడా టాలీవుడ్ సూపర్ హీరో అక్కినేని నాగార్జునను పార్టీలోకి లాగేయాలని గాలం వేశారు.
జగన్కు ఆత్మీయ స్నేహితుడినని చెప్పుకున్న నాగార్జునపైనా వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆయనను ఎలాగైనా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఒప్పించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ నాగార్జున సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం విజయవాడలో గట్టిపోటీ ఇవ్వాలంటే నాగార్జున లాంటి స్టార్ అవసరమని భావిస్తున్నారు. దీంతో నాగార్జున పోటీకి అంగీకరించారని కొన్ని ప్రో వైసీపీ సోషల్ మీడియాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లలోనూ లీకులు ఇప్పించారు.
అయితే నాగార్జున తీరు చూస్తే ఆయన రాజకీయాలకు అంటీ ముట్టనట్లే ఉన్నారు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజ కీయాల్లోకి రాలేదు. జగన్ తో అయినా ఇతరులతో అయినా పరిచయాల్ని వ్యక్తిగత స్నేహం వరకే ఉంచారు కానీ రాజకీయాల వరకూ తీసుకు రాలేదు. నొప్పింపక తానొవ్వక అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆయన చేసిన సాయం గురించి రాజకీయవర్గాలు కథలు కథలుగా చెప్పుకుం టాయి. కానీ ఆయన మాత్రం నేరుగా వైసీపీకి మద్దతు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయనను ఎలాగైనా పార్టీ లో చేర్చుకోవాలని ప్రయత్ని స్తున్నట్లుగా తెలుస్తోంది. మీడియా ద్వారా లీకులిచ్చి.. ఆ తరవాత వైసీపీ హైకమాండ్ ఆయన వద్ద ఆ ప్రతిపాదన పెట్టి, తిరస్కరించలేని విధంగా ఫిక్స్ చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగా ర్జున వ్యాపార, ఆర్థిక లింకుల కారణంగా ఈ సారి తప్పించుకోలేకపోవ చ్చున నే వాదన కూడా వినిపిస్తోంది.
అయితే, హీరో నాగార్జున్ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి చూపుతున్నారా అన్నది అనుమానమే. గతంలో వైఎస్ ఆర్ ప్రబుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన యాడ్స్‌లో కనిపించారు.కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి అప్పుడూ ప్రదర్శించలేదు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడయి యాడ్స్‌లో నటించాడు కానీ రాజకీయాలపట్ల కాదన్నది నాగార్జున మాటగా పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి సినీ హీరోని తన వేపు తిప్పుకోగలడన్నది ప్రశ్నార్ధకమే.