ఆజాదీకా అమృత్ మహోత్సవ కమిటీ భేటీకి జగన్ డుమ్మా
posted on Aug 5, 2022 @ 8:36PM
తెలుగు వన్ ముందే చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే అజాదీ కా అమృత్ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొడతారని. ఇప్పుడు అదే జరుగుతోంది. గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఎటూ హాజరు కారు. గత కొద్ది కాలంగా ఆయన మోడీకి అసలు ఎదురు పడటానికే ఇష్టపడటం లేదు.
మోడీ హైదరాబాద్ పర్యటనలలో కూడా ఆయన ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని ఆహ్వానం పలకాల్సి ఉన్నా కూడా పట్టించుకోలేదు. మోడీని కలవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆయన ఆహ్వానం అందినా ఆ సమావేశానికి డుమ్మా కొడతారని తెలుగువన్ ముందుగానే చెప్పేసింది. అయితే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లే అవకాశాలు లేవని ముందు నుంచీ తెరాస శ్రేణులూ, పరిశీలకులూ కూడా చెబుతూనే ఉన్నారు. కానీ జగన్ ప్రధాని మోడీ ఆహ్వానాన్ని కూడా కాదని ఆ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి గైర్హాజరు అవుతారని మాత్రం తెలుగు వన్ ముందుగానే అంచనా వేసింది. జగన్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టడానికి కారణం అదే సమావేశానికి ఏపీ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందడమేనని కూడా తెలుగు వన్ వివరించింది.
జగన్ రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా పరిగణిస్తారనీ, ఆ కారణంగానే చంద్రబాబు హాజరు అవుతారు కనుక ఆ సమావేశానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరని విశ్లేషించింది. అందుకు ఉదాహరణగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు నరసాపురం ఎంపీ హాజరు కాకుండా శత విధాల ప్రయత్నించి సక్సెస్ అయిన సంగతిని ప్రస్తావించింద. ఇప్పుడు తెలుగు వన్ అంచనా వేసిన విధంగానే జగన్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి గైర్హాజరు కావడానికే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన హస్తిన పర్యటనకు రేపు బయలు దేరుతున్నారు.
అయితే ఆయన హస్తిన చేరుకునే సమయానికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ మీటింగ్ పూర్తయిపోతుంది. షెడ్యూల్ ప్రకారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆ సమావేశంలో పాల్గొనాల్సిన జగన్ మాత్రం ఆలస్యంగా అంటే ఏడున్నర గంటలకు ఢిల్లీ వేళ్లేలా ప్రయాణ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే ఆదివారం రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి జగన్ హాజరౌతారు.
.