బిజెపి తెలం 'గానం'
posted on Jun 4, 2013 @ 5:51PM
జూన్ 3న హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణ ఆత్మ గౌరవ సభలో బిజెపి తరపున పలువురు నేతలు ప్రసంగించటం జరిగింది. ఆ సభలో వారు ప్రసంగిస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లు పెట్టండి.... మేం మద్దతు ఇస్తాం అంటూ కాంగ్రెస్ ను ఆదేశించారు. 2004లో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందని, అందుకే యువత ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈసభ ద్వారా నాగం జనార్ధన రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకూడా బిజెపి ద్వారానే తెలంగాణా సాద్యం అంటున్నారు.
ఈ మొత్తం విషయాన్నీ ఒకసారి పరిశీలిస్తే .. 1997 లొ ఒకవోటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వాజపాయ్ నేతృత్వంలోని బిజెపి తరువాత తెలంగాణా అంశాన్ని ఎందుకు థాటవేసింది? ఆనాడు కేంద్ర హోమ్మంత్రి గా ఉన్న అద్వాని తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ రాజధాని హైదరాబాద్ తెలంగాణా మద్యలో ఉన్నది కనుక ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని చెప్పారు.
ఇపుడు బిజెపిలోకి కొత్తగాచేరిన నాగం జనార్ధనరెడ్డిది మరోచిత్రమైన వైఖరి. 1977 లో టిడిపితో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి చత్తీస్ ఘడ్ ,జార్కండ్ ,ఉత్తరాంచల్ అనే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, తెలంగాణాను టిడిపి అడ్డుపడిన కారణంగా ఏర్పాటు చేయలేదని ఇపుడు చెపుతున్నారు. మరి ఇప్పుడు కూడా బిజెపి ఎవరొవకరి పొత్తులేకుండా అధికారంలోకి రాలేదు. అలా జరిగితే మళ్ళీ ఎవరొవొకరి పెత్తనానికి తలవచి తెలంగాణా అంశాన్ని పక్కకు నెట్టరు అన్న గ్యారెంటీ ఏమిటి?
నాగం జనార్ధనరెడ్డి చెప్పినప్రకారం ఆనాడు టిడిపి అడ్డుపడిన కారణంగానే తెలంగాణా ఏర్పడలేదంటే, మరి ఇన్నేళ్ళు ఆయన తెలంగాణా వాదిగా టిడిపిలొ ఏన్నో మంత్రి పదవులు అనుభవిస్తూ ఎందుకు కొనసాగారు. అసలు అన్నిటికి మించి ముఖ్యంగా నాది "సమైఖ్యవాదం", నేను సమైఖ్యవాదిని అంటూ టిడిపిని స్థాపించిన అన్న నన్దమూరి తారక రామారావు పార్టీలో 30సం'ల క్రితం ఈయన చేరినపుడు మరి తెలంగాణ వాదం ఎటుపోయింది? సమైఖ్యవాదిని అని వ్యాఖ్యానించిన ఎన్.టి.ఆర్ హయాంలోనూ, తరువాత చంద్రబాబు హయాంలోనే కదా తెలంగాణ అభివృద్ధి సాధించింది. మరి నాగం ఆరోజు పదవులు అనుభవిస్తూ తెదేపాలో ఉండి, ఇపుడేమో తెలంగాణ ఆత్మగౌరవం అంటూ, వింత వ్యాఖ్యానాలు చేయటం ఎంతవరకు సబబు.
నిన్నగాక మొన్నతెలంగాణ నగారా అంటూ బాకా ఊదిన నాగం,నేడు ఆ నగారా ఎవరికీ వినబడక పోయేసరికి ఇపుడు కొత్తగా బిజెపిలో చేరి, తన సీటును, రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఐన చిన్న రాష్ట్రాలుగా విడగొట్టి బిజెపి సాధించిన అభివృద్ధి ఏమిటి? నేడు ఆ రాష్ట్రాలు మావోయిష్టుల హస్తగతమై, నిత్యం నెత్తురోడుతున్న వైనం బిజెపి మూటగట్టుకున్న పాపం కాదా?
ఏది ఏమైనా నేడు ప్రతి ఒక్కరిది రాజకీయ దురాశ. ఈనాడు మనం చూస్తున్నది రాజకీయ చదరంగం. ఎవరు ఎంత తెలివిగా ఈ చదరంగంలో పావులు కదప కలిగితే అంతగా రాజకీయ లబ్ధి పొందిన వారవుతారు. అంతేకాని ఏ ఒక్కరికి ప్రజాసంక్షేమం పట్టదు. ఏ ఒక్కరికి సమర్ధ పాలన అందించే సత్త గాని,ధైర్యం గాని లేవు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి.