సమాచారహక్కు చట్ట పరిధిలోకి రాజకీయ పార్టీలు

 

 

 

 

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలకు,ఆకాంక్షలకు స్వరాన్నిచ్చేవి,వాటి సాధన కోసం కృషి చేసేవి రాజకీపార్టీలే. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధికార,విపక్షాలు మధ్యనిరంతరం సాగే చర్చ ....వాటి మధ్య ఉండే స్పర్ధ ..... ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయాలి. మొత్తం మీద సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళగలగాలి.

 

 

కాని నేడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా నీతి,నిబద్ధతలను పాటించటం మానేశాయి. ఏపార్టీ చరిత్ర  చూసినా అవినీతిమయం. ఎవరూ ఎలాంటి పారదర్శక మైన పాలనను అందించే స్థితిలో లేరు. పార్టీల విపరీత పోకడల ఫలితంగా నేడు ఎన్నికల ప్రక్రియ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయి,నల్లధనం ప్రభావం ఎక్కువై పోయి దేశ ఆర్ధిక వ్యవస్థ జవసత్వాలను తల్లక్రిందులు చేస్తున్న పరిస్థితిని ప్రజలు చూస్తున్నారు.


            

వీటన్నిటిని నేపధ్యంలోనే కేంద్ర సమాచార (సి . ఐ .సి )కమీషన్ రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబు దారీ కావాలని తీర్పునిచ్చింది. సి. ఐ. సి పూర్తిస్థాయి ధర్మాసనం రాజకీయ పార్టీలన్నీ కూడా సమాచారహక్కు చట్టం కింద ప్రజాసంస్థలేనని తేల్చి చెప్పింది. దీనిప్రకారం పార్టీలన్నీ తమకు అందుతున్న నిధులన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయో,వాటిని ఏ రకంగా ఖర్చుపెడుతున్నారో వెల్లడించాల్సిన్దేనని స్పష్టం చేశాయి. దీని ప్రకారం కేవలం రాజకీయ పార్తీలేకాదు,ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు అందరు ఈసమాచారహక్కు చట్టుం పరిధిలోకి రావాలి. అపుడే వారి వారి వ్యక్తిగత ఆస్తుల వివరాలు,వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిస్థాయి నిజానిజాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలు వాటిపై పూర్తిస్థాయిలో ఆయా ప్రతినిధులను నిలదీసే హక్కును కలిగిఉంటారు. అపుడే అవినీతి చాలా వరకు కట్టడి చేయగల పరిస్థితి ఉంటుంది. 
         
               

ధీరూభాయి అంబానీ నుండి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు రాజకీయాలను ఉపయోగించుకుని వారి వ్యాపార సామ్రాజ్యాలను ఎలా విస్తరించుకున్నారనేది జగమెరిగిన సత్యం. అంటే నేడు రాజకీయాలను అంతర్గతంగా శాసిస్తున్నది పారిశ్రామికవర్గాలే. ఈ చట్టం పరిధిలోనికి రాజకీయపార్టీలను,ప్రజాప్రతినిధులను తీసుకురావటం కారణంగా అంబానీలు, బిర్లాలు,టాటాలు వంటిపారిశ్రామికవేత్తలు ఏఏ పార్టీలకు ఎంతెంత విరాళాలు ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలుసుకొనే వీలుకలుగుతుంది.

                        

అంతేకాదు ఈ కమీషన్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో పాటిస్తున్న మార్గదర్శకాలేమిటో చెప్పాలని కోరింది. దీనిమూలంగా సమర్ధులైన అభ్యర్థులను పక్కకు తప్పించి కేవలం అసమర్దులైన అభ్యర్ధులను ఎలా ఎంపిక చేస్తున్నారనే విషయం ప్రజలకు అవగతమవుతుంది.   
                              
                         

ఈ సమాచార హక్కు చట్టం కారణంగా వివిధ రకాల కుంభకోణాలు అన్నీ నేడు వెలుగు చూస్తున్నాయి. నేడు రాష్ట్రంలో వివిధ రకాల రాజకీయపార్టీలు,ఒక్కొక్కరికి ఒక్కో పేరుమోసిన ప్రాంతంలోవిలాసవంతమైన పార్టీ భవనాలు . వీటన్నిటికి అయ్యేఖర్చు ప్రజాధనమే కదా !మరి వీరంతా ప్రజలకు జవాబుదారీ ఎందుకు కారు ?అడ్డదారుల్లో వేల కోట్లను పోగేసుకొనే వెసులుబాటును వదులుకొనే ప్రసక్తే లేదని నేడు పార్టీలు మొరాయిస్తున్నాయి.

                      

బ్రిటన్ లో సర్ క్రిస్టోఫర్ కెల్లి నేతృత్వంలోని కమిటీ వ్యక్తులైన,సంస్థలైన ఏ రాజకీయపార్టీకి ఏడాదికి  పదివేల పౌండ్లును మించి విరాళాలు ఇవ్వరాదని నిర్దేశించింది. అలాంటి కతినమైన నిర్ణయాలు మన ప్రజాస్వామ్యదేశంలో కూడా ఖచ్చితంగా ఉంది తీరాలి. ఏ పారిశ్రామికవేత్తలైన నిర్దేశిత మొత్తంలోనే పార్టీ నిధులకు విరాళాలు అందించాలి. అందించిన మొత్తానికి జమా,ఖర్చులను ప్రజలకు ఆయాపార్టీలు నివేదించాలి.

             

అలాజరిగినప్పుడే ఈ రాజకీయనేతల పిల్లలు ఏ పారిశ్రామికవేత్త అండదండలతో విదేశాలలో చదువులు, వ్యాపారాలు కొనసాగిస్తున్నారో ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుఉంటుంది. అన్నింటికీ మించి ఈ సమాచారహక్కు చట్టాన్ని ప్రజలు తమ చైతన్యవంతమైన ఆలోచనలకు పదును పెట్టటం ద్వార వినియోగించుకోగలగాలి. అపుడే అడుగంటిపోతున్న ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలే రక్షించుకున్న వారవుతారు.