ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారు: డీకే అరుణ
posted on May 4, 2020 @ 6:21PM
రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట తప్పారని అరుణ ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెకందిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు కూడా ఈ సమయంలో రాజకీయం చేస్తే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని డీకే అరుణ ధమ్‌కీ ఇచ్చారు.
కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పని తీరు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ అలసత్వం వంటి అంశాలపై తెలంగాణ జేజెమ్మ ప్రభుత్వం పై విరుచుకు పడింది.
తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని అరుణ వివరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి, అకాల వర్షాలు, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని టీఆర్ఎస్ మంత్రులను ఆమె హెచ్చరించారు.