నిమ్మగడ్డ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా!
posted on May 4, 2020 @ 6:21PM
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై విచారణ ఈరోజు పున:ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు హైకోర్టులో నేరుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హైకోర్టు సూచన మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులకు పోలీసులు పాసులు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వేరే వారు వస్తుండటంతో నేరుగా విచారించాలని న్యాయవాదులు సూచించడంతో అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది.
నిమ్మగడ్డ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది. తాజాగా జరిగిన విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై దాదాపు 5 గంటల పాటు వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, నారాయణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు ఉన్నందున, రేపటి విచారణలో మరికొందరు పిటిషనర్ల వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలంపై ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.