బీజేపీ బీసీ మంత్రం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందం?
posted on Oct 28, 2023 9:26AM
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు. అయితే, అదేమిటో కానీ, కమల దళం రేకలన్నీ, కాలి వాడి రాలిపోయిన తర్వాత, ఇప్పడు బీసీ మంత్రం జపిస్తోంది. నిజానికి, బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన పెద్ద తప్పు, ఎన్నికల ముంగిట పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించడం. అంతకు మించిన మరో తప్పు కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం. ఇతర కారణాలు ఉన్నా ప్రధానంగా ఈ రెండు తప్పులు బీజేపీని ఎన్నికల రేసులోంచి దాదాపుగా పక్కకు నెట్టేశాయి. సంజయ్ మూడేళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరై పోయింది. చివరకు ఏపీలోలానే తెలంగాణలోనూ బీజేపీ ఆటలో అరటి పండుగా మిగిలిపోయింది. బండిని డ్రైవింగ్ సీట్ లోంచి తప్పించడంతో బీజేపీ బండి పట్టాలు తప్పింది. ప్రమాదంలో పడింది.
ఇక ఇప్పడు శుక్రవారం(అక్టోబర్ 27) సూర్యాపేటలో బీజీపీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. నిజమే రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా ప్రయోగించిన బీసీ మంత్రం నిజంగా పనిచేస్తే అది బీజేపీకి గేమ్ చేంజర్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ బీజేపీ తప్పులో కాలేసింది. ఎప్పుడో చేయవసిన పని ఇప్పుడు చేసింది. అంతే కాదు ఓ వంక బీసీ బండిని పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించి ఇప్పడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినంత మాత్రాన బీసీలు నమ్ముతార? బీజేపీ వైపు చూస్తారా? అంటే సందేహమే అంటున్నారు విశ్లేషకులు.
అయితే అమిత్ షా ప్రకటన రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నిజానికి, బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించ కుండా బీసీ నేత ఈటల రాజేందర్ ను అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే ఫలితం మరోలా ఉండేదని బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అగ్రకుల (వెలమ, రెడ్డి) పార్టీలుగా ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే అయితే కేసీఆర్ కాదంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అలగే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అయితే రేవంత్ రెడ్డి, కాదంటే ఉత్తమ కుమార్ రెడ్డి ఆయనా కాకపోతే కోమటి రెడ్డి ముఖ్యమంత్రి అవుతారే కానీ ఏ బీసీ నాయకుడో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ వుంది. ఈ నేపధ్యంలో బీసీ కార్డును సమర్ధవంతంగా వినియోగించుకునే చక్కని అవకాశం బీజేపీకి మాత్రమే వుంది. అయితే అంతర్గత కుమ్ములాటల కారణమోచ మరోటో కానీ బీజేపీ అగ్ర నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. ఇక ఇప్పడు, బీసీ మంత్రం జపించినా అంతగా ఫలితం ఉండక పోవచ్చని బీజేపీలోనే ఒక వర్గం నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
అయితే మరోవర్గం నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారం ఊపందు సమయంలో అమిత్ షా విసిరిన బీసీ సవాల్ ప్రత్యర్ధుల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్ళు చల్లిందని అంటున్నారు. నిజానికి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. బీసీ కార్డుతో పాటుగా అమిత్ షా ఎక్కు పెట్టిన కుటుంబ పాలన, కుటుంబ పార్టీ అస్త్రం ప్రజలను ఆలోచింప చేస్తుందని కూడా కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కాగా సూర్యాపేట సభలో అమిత్ షా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. అటు రాహుల్ గాంధీని పీఎం చేయటమే సోనియా గాంధీ జీవిత ధ్యేయమని ఈ రెండు పార్టీలకూ బీసీల సంక్షేమం ఏమాత్రం పట్టదని చెప్పుకొచ్చారు. అందుకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రత్యక్షసాక్ష్యమని చెప్పు కొచ్చారు. అంతే కాదు, బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ కేసీఆర్‌కు సవాల్ కూడా విసిరారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిన నేపధ్యంలో బీజేపీ బీసీ మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడవలసిందే కానీ ఇప్పుడే తీర్పు చెప్పలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.