ఆ 19 నియోజకవర్గాలపై సస్పెన్స్
posted on Oct 28, 2023 7:04AM
తెలంగాణ ఎన్నికలలో విజయంపై ధీమాతో రేసు గుర్రంలా పరుగెడుతున్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. రెండో జాబితా ప్రకటించిన తరువాత కూడా ఇంకా 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్న దానిపై కసరత్తు సాగుతోంది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, శుక్రవారం (అక్టోబర్ 27) మరో 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. అయితే మిగిలిన 19 నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవడంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నది. తీవ్ర కసరత్తులు, పలు భేటీలు, సంప్రదింపుల తరువాత కూడా 19 ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను తొలి, మలి విడత జాబితాలలో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 19 నియోజకవర్గాల విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన ఈ 19 నియోజకవర్గాలలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ ఉండటమే కాకుండా.. పొత్తులో భాగంగా వామపక్షాలు, కోదందరామ్ నేతృత్వంలోని టీజేఎస్ లకు కేటాయించాల్సి ఉండటం కూడా పార్టీ ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ ఆ 19 అసెంబ్లీ నియోజకవర్గాలూ ఏమిటంటే..
వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్,నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పఠాన్ చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్, అశ్వారావుపేట. వామపక్షాలు, టీజేఎస్‌కు కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చాకా రానున్న రెండు మూడు రోజులలో ఈ స్థానాలలో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది మూడో జాబితాలో ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోంది.