తెలుగుదేశం, జనసేన ఐక్యతారాగం.. జగన్ సర్కార్ కు డేంజర్ బెల్!
posted on Oct 28, 2023 @ 9:55AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక పెద్ద ముందడుగు వేశాయి. ఔను ఇప్పటికే రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరింది. క్షేత్ర స్థాయి నుంచీ రెండు పార్టీలూ సమన్వయంతో కలిసి నడిచేందుకు తమ కూటమి ఇక నుంచి ఒకే గొంతుకతో, ఒకే గళంతో ముందుకు వెడుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా ప్రకటించారు. ఈ సంయుక్త ప్రకటన అధికార వైసీపీకి నిస్సందేహంగా డేంజర్ సిగ్నలేనని పరిశీలకులు అంటున్నారు. ప్రజావ్యతిరేక ఓట్లు చీలే ప్రశక్తే లేదనీ, ఏపీలో జరగబోయేది ముఖాముఖీ పోరేననీ ఈ సంయుక్త ప్రకటనతో తేలిపోయింది. రంగంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నా.. ఆ రెండు పార్టీలూ పోటీ పడాల్సింది నోటాతోనేననీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమస్యలపై సంయుక్తంగానే పోరాడుతున్నాయి. తెలుగుదేశం కార్యక్రమాలలో జనసైనికులు, జనసేన కార్యక్రమాలలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. వెరసి ఏ పార్టీ కార్యక్రమమైనా ఇరు పార్టీల జెండాలూ రెపరెపలాడుతున్నాయి. లోకేష్ యువగళం పాదయాత్రలో జనసేన పతాకం రెపరెపలు, పవన్ కల్యాణ్ వారాహీ యాత్రలో తెలుగుదేశం జెండాలే ఇందుకు తార్కానం. సరే అదలా ఉంచితే ఇరు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ప్రకటన వెలువడిన తరువాత తొలి సారిగా ఇరు పార్టీలదీ ఇక ఒక అజెండా, ఒకే లక్ష్యం అన్న అధికారక ప్రకటన మాత్రం తెలుగుసేన నామకరణంతోనే వెలువడిందని చెప్పవచ్చు.
అసలు ఇప్పుడు కాదు.. రెండు పార్టీలూ కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన అధినేత ఎప్పుడో రెండేళ్ల కిందటే ప్రకటించేశారు. అప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందన్న అభిప్రాయం ఇరు పార్టీల శ్రేణులలోనూ, రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా బలంగా వ్యక్తం అయ్యింది. ఇరు పార్టీల శ్రేణులూ కూడా అందుకు స్వాగతించాయి. క్షేత్రస్థాయిలో కలిసే పని చేస్తూ వస్తున్నాయి. అధికార పార్టీ ఈ రెండు పార్టల మధ్యా పొత్తు పొడవకుండా ఉండేందుకు ఎన్ని యత్నాలు చేసినా, కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అజ్యం పోయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
సరే పవన్ కల్యాణ్ రెండేళ్ల నంచీ చెబుతున్న తెలుగుదేశంతో పొత్తు అన్న మాటను రాజమహేంద్రవరం వేదకగా తానే స్వయంగా ప్రకటించేశారు. అదీ జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబుతో రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ అయి బయటకు వచ్చిన వెంటనే ఈ ప్రకటన చేయడంతో ప్రజలలో కూడా ఈ రెండు పార్టీల పొత్తుకు సానుకూలతే కనిపించింది. ఎవరినైనా సరే.. తాము తలచుకుంటే ఎంత కాలమైనా అక్రమంగా నిర్బంధించగలమనీ, రాష్ట్రంలో ఎక్కడా తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చిన్న పాటి మాట వినబడినా సహించేది లేదనీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకు కూడా సంకెళ్లు వేశాశమనీ విర్రవీగుతున్న వైసీపీ అధికార మదాన్ని అణచాలంటే.. జగన్ పార్టీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిందేనన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. జనం కూడా రాక్షస పాలన నుంచి తమకు విముక్తి కలిగాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఐక్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, లోకేష్ లు వారం రోజుల కిందట రాజమహేంద్రవరం వేదికగా జరిగిన సమన్వయ కమిటీ భేటీలో ఈ ఐక్యతా రాగం అధికార పార్టీ చెవులు గింగిర్లెత్తేలా వినిపించింది.