డామిట్.. బిడ్ కథ అడ్డం తిరిగింది!
posted on Apr 14, 2023 @ 2:20PM
అందరి విషయం పక్కన పెడితే, అన్నీ తెలిసిన జేడీ లక్ష్మినారాయణ సహా మేధావులు అనుకునే మరొకొందరు ఎలా, తప్పులో కాలేశారు? కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని, ఓ సహాయ మంత్రి అలవోకగా చేసిన ప్రకటన తుడిచేస్తుందని, అంతటి జేడీ ఎలా భావించారు? అంతే కాదు స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తెచ్చుకోవడంలో విఫలమైన, కనీసం ఒక మెడికల్ కాలేజీ తెచ్చుకోవడం చేతకాని బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగిందని అంతటి జేడీ.. ఎలా భావించారు? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని పక్కన పెట్టినా, తెలుగు దేశం, జనసేన, ఉభయ కమూనిస్ట్ పార్టీల నాయకులు,ఈ అందరినీ మించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు చేసిన ఆందోళనలకు తలోంచని, తలొగ్గని కేంద్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులు సాగించిన ‘బిడ్’ రాజకీయానికి కేంద్ర ప్రభుత్వం భయపడి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని, తెలంగాణ మంత్రులు అనుకుంటే అనుకోవచ్చు. కానీ, అన్నీ తెలిసిన జేడీ లక్ష్మీనారాయణ ఎలా అనుకున్నారు? అనేది చాలా మందికి పజిల్ గా మారింది. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరే ఆలోచనలో ఉండడమే ఇందుకు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జేడీ విషయం పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే నిజానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్థే తాజా ప్రకటనలో కొత్తదనం ఏదీ లేదు. 2021 జనవరి 27న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది.. అయితే గడచిన రెండేళ్ళలో ప్రేవేటీకరణ సంబందించిన ప్రక్రియ సాగవలసినంత వేగంగా ముందుకు సాగలేదు. అదే విషయాన్ని కేంద్ర మంత్రి కాసింత తీపిగా ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు విభాగాలను బలోపేతం చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఆ మాట మీద కూడా మంత్రి నిలబడలేదు. సాయంత్రం అయ్యేసరికి మాట మార్చారు, తూచ్ ... విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తన ఒక్కడి చేతుల్లో లేదని చావు కబురు చల్లగా చెప్పారు. నిజానికి కేంద్ర సహాయ మంత్రికి మంత్రివర్గ నిర్ణయాలలో ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. అయినా, గురువారం(ఏప్రిల్ 13) విశాఖ పర్యటనకు వచ్చిన ఉక్కు శాఖ సహాయ మంత్రి చేసిన ఒక అనధికార ప్రకటన ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసీఆర్ ఒంటి చేత్తో ఆపేశారని సంబురాలు చేసేసుకున్నారు. చేసుకుంటున్నారు. కోటలు దాటే మాటలూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ సంబరపడాల్సిందేమీ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే, మరోమారు వంచనా శిల్పాన్ని ప్రదర్శించింది. పూటకో మాట.. రోజుకో ప్రకటనతో ప్రజలను, కార్మికులను ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం మరోమారు అవమానించింది. నిజానికి కేంద్ర మంత్రి ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవేటీకరణ విధానం నుంచి కేంద్రం వెనక్కి రాలేదని తాజాగా మరోసారి స్పష్టమైంది.
కేంద్ర మంత్రి ఉదయం వైజాగ్ పోర్టు కళావాణిలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు. విభాగాలను బలోపేతం చేస్తాం అంటూ ప్రకటించారు. దీంతో స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం, రెండు తెలుగు రాష్ట్రాలోకీ ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెళ్లింది. కేంద్ర మంత్రి ప్రకటన ఎంతో కొంత ఉపశమనం కలిగించింది అనుకునేలోపే అంతా నా చేతిలో లేదు. కేంద్ర మంత్రి మండలి చేతిలో ఉంది అని సహాయ మంత్రిగారు మాట మార్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, స్టీల్ యూనియన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి యూ టర్న్ తీసుకున్నారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం స్ట్రాటజిక్ సేల్ కింద పెట్టడాన్ని నిలిపివేయాలని, ఇది వరకే ప్లాంట్‌ను అమ్మివేసే దిశగా వేసిన లీగల్ అడ్వైజరీ, ఆస్తుల మదింపు, ట్రాన్జాక్షన్ కమిటీలను రద్దు చేయాలని ప్రతిపాదన చేశారు.
ఈ విషయమై మంత్రి జోక్యం చేసుకుంటూ 'అంతా నా చేతిలో ఏమీ లేదు. ఢిల్లీలో నేను మాట్లాడతాను. మీరు చేసిన ప్రతిపాదనలు తెలియజేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి వెళుతుందన్న మాట ఉక్కు పరిరక్షణ కమిటీ, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి వెల్లడించలేదు. దీంతో కార్మిక సంఘాలు పోరాటం కొనసాగుతుందని పేర్కొనాయి.
కానీ ఈలోపే తెలంగాణ మంత్రులు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ దెబ్బ అంటే అలా ఉంటుందని స్వయంగా మంత్రి కేటీఆర్ జబ్బలు చరుచుకున్నారు. కానీ ఈ చప్పట్లు, సంబురాలు ముగిసే లోగానే కేంద్ర మంత్రి, యూ టర్న్ తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి చేసిన తొందరపాటు ప్రకటనలు ఇప్పుడు బీఆర్ఎస్ మెడకే చుట్టుకున్నట్లు అయిందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఒక వర్గం కేసీఆర్, కేటీఆర్ రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్నతొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రకటనల కారణంగానే కేంద్ర మంత్రి మధ్యాన్నానికి మాట మార్చారని అంటున్నారు. అలాగే ఇప్పడు ‘బిడ్’ విషయంలోనూ బీఆర్ఎస్ సర్కార్ కు తిప్పలు తప్పక పోవచ్చని, అంటున్నారు.