ఔను.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఒక్కటయ్యాయి!
posted on Apr 14, 2023 @ 2:01PM
ఆంధ్ర ప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కటయ్యాయి. కేంద్రంలోని బీజేపీ విద్రోహపూరిత విధానాలపై రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచార భేరికి శ్రీకారం చుట్టాయి. రాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకటిగా గొంతెత్తాయి. రెండు పార్టీల ఉమ్మడి ప్రచార భేరి విజయవాడ నుండి ప్రారంభమయ్యింది. అ దే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అరాచక పాలనను వామపక్షాల నేతలు ఎండగట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరాటానికి శ్రీకారం చుట్టండం రాష్ట్ర రాజకేయాల్లో పెను మార్పులకు దరి తీస్తుందని రాజకీయ సమీకరణాలలోనూ మార్పుకు శ్రీకారం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యేందుకు కమ్యూనిస్టుల ఉమ్మడి పోరాటం దోహదం చేస్తుందంటున్నారు.
మతోన్మాద బిజెపిని సాగనంపుదాం ! దేశాన్ని కాపాడుకుందాం! అనే నినాదంతో విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రచార భేరి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మే 1 వ తేదీ వరకూ కొనసాగుతుందని వామపక్ష పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి ప్రారంభోత్సవం సందర్భంగా... విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్, సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వినరు విశ్వం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తదితరులు నివాళులర్పించారు. విజయవాడ ఎంబివికె భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజా నాట్యమండలి బృందం సంగీతాలాపన చేసింది. నృత్య ప్రదర్శనలతో అలరించింది.
ప్రారంభ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ ప్రసంగించారు. బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.
ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, భావోద్వేగాల ద్వారా మరలా అధికారంలోకి రావాలనే దుష్ట ప్రయత్నం మోడీ, అమిత్‌షా బృందం చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా, సామరస్యంగా, సంతోషంగా ప్రజలు పండుగలు, పబ్బాలు జరుపుకునే పరిస్థితి లేకుండా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణను సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణాన్ని, నరేంద్రమోడీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా బిజెపి దుర్మార్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి కనీసం ఖండించడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు పాఠశాలల్లో స్వేచ్ఛగా విస్తృతంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల మెదళ్లను మతం పేరుతో కలుషితం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టి, మతసామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ఉద్దేశం రాష్ట్రప్రభుత్వానికి లేదని విమర్శించారు.
కేంద్రం ముందు నుంచి పొడిస్తే రాష్ట్రప్రభుత్వం వెనక నుంచి పొడుస్తోందన్నారు. ఇది దుర్మార్గమన్నారు. ప్రైవేటీకరణపై సిఎం మౌనంగా ఉంటే మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని అంగీకరించబోమన్నారు.