టీఆర్ఎస్ నేతలకు నిలదీతలు! బంద్ లో కనిపించని రైతులు
posted on Dec 8, 2020 @ 2:46PM
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించినా ప్రజల నుంచి స్పందన పెద్దగా కనిపించలేదు. కేటీఆర్ సహా మంత్రులంతా రోడ్డెక్కినా.. ఎక్కడా రైతులు వాళ్లకు సపోర్ట్ గా నిలవలేదు. బంద్ లో టీఆర్ఎస్ నేతల, కార్యకర్తల హడావుడే ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లోనూ భారత్ బంద్ ప్రభావం ప్రజలపై పడలేదు. రోడ్లు బ్లాక్ చేసి ఆందోళనలు చేసినా.. స్థానికులు వ్యతిరేకించడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు. రైతుల సమస్యలపై బంద్ నిర్వహిస్తూ.. రైతులు లేకుండా నిరసనలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతుల ఫోటోలు కాకుండా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేయడాన్ని కొందరు ప్రశ్నించారు.
భారత్ బంద్ లో భాగంగా రోడ్డుపై ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చాాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలపై స్థానికులు తిరగబడ్డారు. రాష్ట్రంలో రైతులు సమస్యలను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఆందోళనలు చేయడం ఏంటనీ అన్నదాతలు కూడా పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై స్థానికులు జనం తిరగపడ్డారు. ఉష ముళ్లపూడి కామన్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేస్తుండగా.. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని జనాలు ప్రశ్నించారు. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు.. ఇప్పుడే కనిపించాయా? అంటూ ఓ మహిళ నిలదీసింది. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని ఎమ్మెల్యేను కడిగి పారేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ధర్నాలో మంత్రి ఈటల రాజేందర్ ముందే రైతుల కష్టాలను ఏకరువు పెట్టాడు యువ రైతు. రైసు మిల్లుల్లో తాలు పేరిట కోతలు విధిస్తున్నారని, మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు మంత్రి రాజేందర్.
రైతులు పిలుపిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. వేరువేరుగా ఆందోళనలు నిర్వహించాయి.అయితే నిరసనల్లో భాగంగా రెండు పార్టీల మధ్య చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. మోడీ సర్కార్ తో పాటు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు వారితో గొడవలకు దిగారు. కరీంనగర్ జిల్లాలో భారత్ బంద్ ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ ఎలా పాల్గొంటుందని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో కరీంనగర్ ప్రధాన బస్టాండ్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లావెల్గటూర్ మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు కాంగ్రెస్నాయకులు. భారత్ బంద్ లో పాల్గొనేందుకు ధర్మపురి వెళుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ను చొప్పదండి వద్ద అడ్డుకున్నారు.ఖమ్మం జిల్లా మధిర లో కాంగ్రెస్ టిఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
భారత్ బంద్ లో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ మండలకేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గీయులు మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.తూప్రాన్ హైవె పై జరిగిన టిఆర్ఎస్ దర్నా లో ఫ్లెక్సిల వివాదం తలెత్తింది.ఉద్యమ కాలం నుండి టిఆర్ఎస్ లో పని చేస్తున్న వారి ఫోటోలు లేవని కొందరు గొడవ చేశారు. ధర్నా చేయకుండానే ఓ వర్గం నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాలో టీఆర్ఏస్, బీజేపీ నాయకుల పోటా పోటీ ధర్నాలకు దిగారు. భువనగిరిలో సిపిఎం, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెరిచి ఉన్న బేకరీ షాపుపై సీపీఎం కార్యకర్తలు రాళ్ల విసరడంతో బీజేపీ కార్యకర్తకు గాయమైంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు బంద్ లో పాల్గొనలేదు. ఈ రెండు పార్టీలు పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వడంతో.. రైతుల పోరాటానికి నేరుగా సపోర్ట్ చేయలేకపోయాయి. ఏపీలో బంద్ వామపక్షాలు, కార్మిక సంఘాల వరకే పరిమితమైంది. వ్యాపార సంస్థలు కొంత వరకే మూత పడ్డాయి. ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత అంతటా సాధారణ పరిస్థితులు కనిపించాయి.బంద్ లో పాల్గొనకపోయినప్పటికి.. విజయవాడలో రైతులకు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు తమ పార్టీ సూచించిన సవరణలు చేయాలని కోరారు. రైతుల ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలని, దీనిపై ప్రధాని మోడీ వెంటనే ప్రకటన చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భారత్ బంద్ పైనా టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకున్నారు.