మోడీతో పెట్టుకుంటే కాలిపోతారు: కేసీఆర్ పై రాజా సింగ్ ఫైర్
posted on Dec 8, 2020 @ 2:41PM
కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. రైతుల సంక్షేమ కోసం మంచి చట్టాలను తీసుకొస్తే... మాయమాటలు చెపుతూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు రాజా సింగ్. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని విమర్శించారు.
దళారుల చేతిలో రైతులు మోసపోకూడనే ఉద్దేశంతోనే మోడీ సర్కార్ కొత్త చట్టాలను తీసుకు వచ్చిందన్నారు రాజా సింగ్. ఈ చట్టాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయన్న రాాజా సింగ్... మోడీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. శక్తితో పెట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. రైతుల భూములను కబ్జా చేసి, వెంచర్లు వేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు రాజా సింగ్.