వంటల్లో నుండి ఇంటి క్లీనింగ్ వరకు.. బేకింగ్ సోడా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే..!
posted on Jul 12, 2024 @ 9:30AM
బేకింగ్ సోడా.. బేకింగ్ పౌడర్ అని రెండు రకాలు ఉంటాయి. వీటిలో బేకింగ్ సోడాను సాధారణంగా వంటల్లోనూ, బేకింగ్ పౌడర్ ను కేకులు, బేకింగ్ ఆహారాలలోనూ ఉపయోగిస్తారు. అయితే బేకింగ్ సోడాను కేవలంలో వంటల్లో మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాల కోసం వాడుతుంటారు. దీన్ని వంటింటి నుంచి ఇల్లు క్లీన్ చేయడం వరకు బోలెడు రకాలుగా ఉపయోగిస్తారు. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే..
బేకింగ్ సోడాను ఇంట్లో కర్టెన్ల నుండి సోఫా కవర్ లు, కార్పెట్ లు, దిండు కవర్ లు, దుప్పట్లు ఇలా చాలా రకాల క్లాత్ లను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మురికి బాగా వదలడమే కాకుండా క్లాత్ లు మాసిన వాసన పూర్తీగా వదులుతాయి.
బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి స్టవ్ శుభ్రం చేసుకోవచ్చు. ఇది స్టవ్ మీద పేరుకున్న మొండి జిడ్డును, గ్రీజు వంటి పదార్థాన్ని చాలా సులభంగా తొలగిస్తుంది. స్టవ్ కొత్త దానిలా మెరుస్తుంది కూడా.
వెనిగర్, బేకింగ్ సోడా రెండింటిని మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. దీన్ని స్టవ్, ఓవెన్, ఇతర జిడ్డు ప్రాంతాలలో స్ప్రే చేయాలి. ఆ తరువాత తడి గుడ్డ సహాయంతో శుభ్రంగా తుడిచి తరువాత పొడి బట్టతో నీట్ గా తుడుచుకోవాలి.
వంటగదిలోనూ, బాత్రూమ్ లలోనూ, హాల్ లో సింక్ దగ్గరా కుళాయిలు తరచుగా తుప్పు పడుతూ ఉంటాయి. ఈ తుప్పును, తుప్పు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని తుప్పు పట్టిన కుళాయి మీద స్ప్రే చేసి ఆ తరువాత క్లాత్ తో శుభ్రం చేస్తే తుప్పు వదిలిపోతుంది.
బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించడానికి వెనిగర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసం అయినా ఉపయోగించవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడా, వెనిగర్ ను ఒక గిన్నెలో వేసి ఆ తరువాత దాన్ని కుళాయికి అప్లై చేయాలి. కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
డ్రస్సులు, చీరల మీద మరకలు పడినట్లైతే వాటిని తొలగించడానికి బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను మరకల మీద వేసి కొద్దిసేపటి తరువాత శుభ్రం చేయాలి. తరువాత దాన్ని సాధారణంగా సర్ఫ్ లేదా వాషింగ్ మెషీన్ లో వాష్ చేయాలి.
బాత్రూమ్ మూలలలోనూ, బాత్రూమ్ లో ఇతర ప్రాంతాలలోనూ మురికి ఎక్కువగా ఉంటే దానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా, వెనిగర్ ను మిక్స్ చేసి బాత్రూమ్ లో స్ప్రే చేయాలి. కొద్దిసేపు అలాగే వదిలేసి ఆ తరువాత బ్రష్ సహాయంతో మూలలు క్లీన్ చేయాలి. మురికి మొత్తం బాగా వదులుతుంది.
*రూపశ్రీ.