పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..!
posted on Jul 11, 2024 @ 12:04PM
పిల్లల పెంపకం ఒక కళ. చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం, చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు, విలువలు అలవాటు చెయ్యాలి. 5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది.
పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు. దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి.
ఇతరులను గౌరవించడం గొప్ప గుణం. దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి. భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం, అసహనం ఉన్నా ఇతరులను అవమానించి మాట్లాడకూడదని, ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.
తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా, గొప్ప పాఠాలుగా సహాయపడతాయి. అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి.
తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి థ్యాంక్స్ చెప్పడం వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి.
సమస్యలు అందరికీ వస్తాయి. వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి. ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.
*రూపశ్రీ.