బీఫ్ ఫెస్టివల్ లక్ష్యం నెరవేరిందా?
posted on Apr 21, 2012 @ 4:49PM
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పెద్దకూర పండగ (బీఫ్ ఫెస్టివల్) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా ఉద్యమం కంటే ఎక్కువగా దీని గురించి చర్చించుకొంటున్నారు. తెలంగాణా ఉద్యమం కోసం కలిసి కట్టుగా ఉద్యమించిన ఉస్మానియా విద్యార్ధులే ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నారు. కత్తులతో దాడులు చేసుకొని ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. చిలికిచిలికి గాలివాన అయినట్టుగా ఈ ఆహర అంశం చుట్టూ రాజకీయాలతోపాటు మత విద్వేషాలు చేరి నెమ్మదిగా పెద్ద సామాజిక సమస్యగా మరే పరిస్థితి కనిపిస్తోంది. అది పెద్దకురా అయినా.. చిన్న కురా అయినా ఆహారాన్ని ఆహారంగా కాకుండా మతం, కులం కోణంతో చూడటం వల్ల మానవత్వం మరింత కలుషితం అవుతుంది.
ఒకప్పుడు దళితులు గొడ్డు మాంసం ప్రధాన ఆహారమని ఉస్మానియా హాస్టల్లో కూడా తమకు గొడ్డు మాంసం వడ్డించాలని ఇటీవల కొంత మంది దళిత విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్ కు డెమెక్రాటిక్ కల్చర్ ఫోరంతో పాటు సిమాంధ్రులను దోపిడీ దారులుగానూ, దొంగలగానూ చిత్రీకరించి, తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చ గోట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, నాగసూరి వేణుగోపాల్, మీనా కందస్వామి, డి. ప్రభాకర్ వంటి వారు మద్దుతు పలికారు. అంతేకాగ బీఫ్ ఫెస్టివల్లో వీరు కూడా పాల్గొన్నారు. ఇటువంటి ఫెస్టివల్ ను నిర్వహిస్తే అడ్డుకుంటామని ఎ.బి.వి.పి విద్యార్దులు ముందే హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ గోశాల సమాఖ్య సభ్యులు ఎ ఫెస్టివల్ నిర్వాహకులపై ముందుగానే పోలీసులకు పిర్యాదు చేశారు. గొడ్డు మాంసం తెచ్చి అంబేద్కర్ హాస్టల్ వద్ద వండుకుంటామని దళిత విద్యార్థులు చెబితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. అయితే బయట వండుకుని లోనికి తెచ్చుకుని తింటే తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. దీనికి కూడా ఉస్మానియా యూనివర్సిటి అధికారులు అంగీకరించలేదు. కాని దళిత విద్యార్థులు బయట నుంచి బీఫ్ తో చేసిన బిర్యాని అంబేద్కర్ హాస్టల్ ఆవరణంలో కి తెచ్చి తింటుండగా ఎ.బి.వి.పి విద్యార్దులు అడ్డుకోవడానికి ప్రయత్ని౦చారు. అనంతరం రెండు వర్గాల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. జీవహింసను వ్యతిరేకించే బౌద్ధ మతంలో చేరిన అంబేద్కర్ పేరిట ఉన్న హాస్టల్ వద్ద కత్తిపోట్లు కూడా చోటుచేసుకున్నాయి. రక్తం కూడా పారింది. అప్పటి దాక దళిత విద్యార్థులకు మద్దతు ప్రకటించిన మేధావి వర్గం అంతా అక్కడ నుంచి పరారైపోయింది. వీరించిన సలహాలు, ప్రోత్సాహంతో విందు జరుపుకున్న విద్యార్థులకు పోలీసు కేసులు మిగిలాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవచ్చా? లేదా? అన్న వాదోపవాదాలు ప్రారంభం కావడం మరో ఎత్తు. ఎవరి ఆహార అలవాట్లు వారివి. మనది లౌకిక, ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ మతాన్ని అయినా అవలభించవచ్చు. ఎవరి సంప్రదాయాలను, అలవాట్లను కొనసాగించుకోవచ్చు. ఎవరి అలవాట్లు వారివి, అటువంటప్పుడు పెదకూర పండుగ అంటూ ప్రత్యేకంగా బీఫ్ తినడాన్ని పండుగగా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నను కొందరు ముందుకు తీసుకువస్తున్నారు. అగ్రకులాలకు చెందినవారు తినే ఆహారమే ఉన్నతమైనది. ఇతరులు తినే ఆహారం నీచమైనదా? కులతత్వంతో కునారిల్లుతున్న భారతదేశంలో కొన్ని కులాలవారు నీచులని, అంటరానివారనే భావన వుంది. అంటరాని కులాలకు చెందిన వ్యక్తులు ఆహారపు అలవాట్లు కూడా నీచామనే ధోరణి చాలామందిలో వుంది. కులం కారణంగా ఎవరూ నీచులు కారని, అదే విధంగా కింది కులాలు తినే ఆహారం నీచం కాదనే తెలియచెప్పడం కోసమే పెద్దకూర వంటి పండుగలు అనివార్యమావుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంది నీచ జంతువూ అయినా శూద్రులలో అగ్రకులాలుగా వున్న అనేకమంది దీని మాంసం తింటారు. అగ్రకులంవారు తింటారు కాబట్టి ఆ మాంసం నీచం కాదు. గొడ్డు మాంసం కేవలం కింది కులాలకు చెందినవారు మాత్రమే తింటారు కాబట్టి అది నీచంగా ప్రచారం చేశారు.
గొడ్డుకూర పండుగలో పాల్గొనడం, దానిని తినడం వల్ల మీరు సాధించింది ఏమిటని హిందుత్వధోరణులతో వున్న విద్యార్థులు కొందరు మేధావులు, విద్యావంతులను ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ పండుగ చేయడం ద్వారా దళితులు తమ సైద్దాంతిక హక్కును చాటుకొనే ప్రయత్నం చేశారన్న వాదన వినిపిస్తోంది.
ఎద్దు మాంసం వండినా, వివిధ వర్గాల వారు ఉండే హాస్టళ్ళలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా ఆవును పూజించేవారు ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో పెద్దకూర పండుగ చేసుకొంటున్నారనే అంశాన్ని మరికొంతమంది ముందుకు తీసుకువస్తున్నారు. పెద్దకూర పండుగ చేస్తున్నప్పుడు పందిమాంసం పండుగ ఎందుకు చేయకూడదు? అంటూ మతతత్వసంస్థలు నిర్వహించే విద్యార్థి సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి. పందిమాంసం పండుగ చేస్తే పందిమాంసాన్ని ముట్టుకోవడమే పాపంగా భావించే మతానికి చెందినవారు సహించరని, వారిని ఎదిరించే సత్తా వీరికి లేదని పరోక్షంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యా సంస్థల్లో వివిధ వర్గాల వారు ఉంటారు. కొందరు గొడ్డుమాంసం కావాలంటున్నారు. యానాదులు వంటివారు ఎలక మాంసాన్ని, మరి కొందరు రకరకాల పిట్ట మాంసాలతో పాటు పావురాయి మాంసాన్ని, ఇంకొందరు పిల్లి మాంసాన్ని కావాలని డిమాండ్ చేస్తే వాటిని కూడా వడ్డించడం సాధ్యం అవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో శాఖాహారం ఉన్నతమైనదని, మాంసాహారం నీచామైనదనే ప్రచారం కూడా జరుతుతోంది. నిజానికి ప్రపంచ జనాభాలో 95 శాతం మంది మాంసాహారులే. అమెరికా, యూరోపియన్ దేశాల్లో గొడ్డు, పందిమాంసం ప్రధానమైన ఆహారం. భారతదేశంలో కూడా 90 శాతం మంది మాంసాహారులే. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో పూజారి వర్గానికి చెందిన వారు కూడా మాంసాహారం భుజిస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులను బట్టి ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. ఎవరిళ్ళలో ఎవరికీ ఇష్టమైన ఆహారం వారు తీసుకుంటే ఏ గొడవా ఉండదు. యూనివర్సిటీల్లోని సామూహిక భోజనశాలల్లో ఎక్కువమంది ఇష్టపడే ఆహారం వద్దించక తప్పదు. మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో గొడ్డుమాంసం తినేవారు తక్కువ శాతం ఉన్నారన్నది నిర్వివాదాంశం. వీరి కోసం సామూహిక భోజనశాలల్లో గొడ్డుమాంసం వడ్డిస్తే, వీరిలాగే ఇతర రకాల మాంసాలను ఇష్టపడే వారి కోర్కె కూడా తీర్చాల్సి వస్తుంది. ఏదో ఒక వర్గం సైద్ధాంతిక హక్కు చాటుకోవడం కోసం ఫలానా మాంసం కావాలని కోరుకుంటే ఇతర వర్గాలు కూడా అలాంటి హక్కునే చాటుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ మరో అంశం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ హక్కు చాటుకోవాలనే భావన వారికే వచ్చిందా లేక వారికెవరైనా సూరిపోశారా? ఈ హక్కులను అడ్డుకున్న వర్గం వెనుక ఎవరున్నారన్న విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.