సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను అరెస్ట్
posted on Apr 21, 2012 @ 6:07PM
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను ఈ రోజు సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. భాను కిరణ్‌ను పోలీసులు రాష్ట్ర డిజిపి కార్యాలయానికి తరలించారు. డిజిపి కార్యాలయం వద్ద పోలీసుల మధ్య ఉన్న భాను కిరణ్ ఛాయాచిత్రాలను తెలుగు టీవీ చానెళ్లు చూపిస్తున్నాయి. భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, భాను కిరణ్ అరెస్టుపై సూరి భార్య గంగుల భానుమతి స్పందించారు. భాను కిరణ్ అరెస్టు మంచి పరిణామమని, జీవితాంతం అతన్ని జైల్లోనే ఉంచాలని ఆమె అన్నారు. మళ్లీ ఇటువంటి ఘటన జరగకుండా భానును శిక్షించాలని ఆమె అన్నారు. ఇప్పటికైనా తన భర్త హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని అనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు