ఇస్లామాబాద్ నగర శివార్లలో కూలిన విమానం
posted on Apr 21, 2012 @ 10:51AM
పాకిస్తాన్‌లో రాజధాని ఇస్లామాబాద్ నగర శివార్లలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు వస్తున్న భోజా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం ‘బీ4213’ ప్రతికూల వాతావరణం వల్ల ఇస్లామాబాద్ దగ్గర్లో జనావాస ప్రాంతంలో కుప్పకూలింది, ఈ ఘోర విమాన ప్రమాదంలో 127 మంది దుర్మరణం పాలయ్యారు. అందులోని మొత్తం 118 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు.
అయితే ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగిందని విమానయాన శాఖ అధికారి ఒకరు చెప్పారు. విమానం నేలకూలగానే శిథిలాల నుంచి మంటలు లేచాయి. విమానం దిగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతినిచ్చిందని, అయితే దిగే లోపలే అది కూలిపోయిందని పౌర విమానయాన సంస్థ వర్గాలు చెప్పాయి. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పాయి. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో లాండింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చినపుడు విమానం భూమికి 2,600 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఆకస్మాత్తుగా అది 3 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి రాడార్ స్క్రీన్ల నుండి మాయమైందని పాక్ హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ వివరించారు.