మునుగోడు ఫలితం తరువాత టీఆర్ఎస్ కు చుక్కలేనా?.. వరదలా బీజేపీలోకి వలసలేనా?
posted on Oct 29, 2022 @ 2:38PM
తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత ఇప్పటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని, ఎదురు లేని పెత్తనం, ఆధిపత్యం చెలాయించిన పార్టీ. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా. ప్రజా వ్యతిరేకతతో పాటు.. పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి తార స్థాయికి చేరిందా? అంటే పరిశీలకులు అవునంటున్నారు.
అధినాయకత్వంపై తిరుగుబావుటా ఎగురువేయడానికి సిద్ధమైన వారి సంఖ్య భారీగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం 2014, 2019 ఎన్నికల తరువాత కేసీఆర్ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ మిషన్ లేనని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పెద్ద సంఖ్యలో ఇరత పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో తెరాస పూర్తిగా కక్కిరిసి పోయిందంటున్నారు. అలా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో వారిపై తెరాస తరఫున పోటీ చేసి పరాజయం పాలైన వారికి పార్టీలో గుర్తింపు లేకండా పోయిందనీ, అలా గుర్తింపు లేకుండా పోయిన వారిలో అత్యధికులు తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ తెరాసతో కలిసి నడిచిన వారేనని అంటున్నారు.
కేసీఆర్ స్వయంగా ఇకపై తమది ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడంతో ఉద్యమ నేతలకు, ఉద్యమ కారులకు ఇకపై పార్టీలో ప్రాధాన్యత ఉండదని చెప్పకనే చెప్పేసినట్లయ్యింది. దాంతో ఉద్యమ కాలం నాటి నేతలంతా పార్టీ నేతలంతా పార్టీలో ఉన్నప్పటికీ మానసికంగా అనుబంధాన్ని కోల్పోయామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సిట్టింగులకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించేయడంతో చాలా నియోజకవర్గాలలో ఆశావహులు ఇక టీఆర్ఎస్ లో కొనసాగడం అనవసరం అన్న అభిప్రాయానికి వచ్చేశారు. అలాగే గత ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు తమ నియోజకవర్గంలోనే గత ఎన్నికలలో ప్రత్యర్థులుగా నిలిచి గెలిచిన వారి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధపడని పరిస్థితి.
ఈ నేపథ్యంలో తెరాస నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో చిక్కిన వారిలో నందు అనబడే నందకుమార్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనీ, ఆ డైరీలో తెరాసకు చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, వారు పార్టీ మారడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. బీజేపీని ట్రాప్ చేయడానికో, లేక వారి ట్రాప్ లో పడటానికో ఫామ్ హౌస్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలూ ఇప్పటికీ ప్రగతి భవన్ లోనే ఉండటం.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటం పై తెరాస వర్గాల్లోనే పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆ నలుగురినీ ఫామ్ హౌస్ లో నిర్బంధించారా అన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.
ఒక వేళ వారు నిజంగానే బీజేపీ అగ్రనేతలను ట్రాప్ చేయడానికే అక్కడకు వెళ్లి ఉంటే వారిని ప్రగతి భవన్ కు పరిమితం చేయకుండా.. మునుగోడు ప్రచారానికి పంపి పార్టీ క్యాడర్ చేత బ్రహ్మరథం పట్టించేవారు కదా అని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో టీఆర్ఎస్ బండారం బయటపడే పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం అటూ ఇటూ అయినా.. అంటే తెరాస విజయం సాధించకపోతే మాత్రం కేసీఆర్ కు తలనొప్పులు తప్పవనీ, తెరాస నుంచి వలసలు గట్టు తెంచుకుని ప్రవహించే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు ఆ వలసలను నివారించడమెలా అన్నదే కేసీఆర్ ముందున్నపెద్ద సవాల్ అనీ, ఆ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలను నియంత్రించ లేని పరిస్థితి ఏర్పడితే టీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడుతుందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం వెలుగులోకి రాగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయి మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆందోళనలకు దిగిన తెరాస శ్రేణులు ఒక్క సారిగా చల్లబడిపోయాయి. ఇందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపే కారణం. హఠాత్తుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై ఎవరూ స్పందించద్దంటూ కేటీఆర్ పిలుపు నివ్వడంతోనే ఏదో తేడా కొట్టిందని తెరాస నాయకులు, క్యాడర్ కు అర్ధమైపోయింది.
అందుకే వారిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వం సంక్షోభ సమయంలో ఎందుకు ఇలా మౌనం వహిస్తోందని పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చ ప్రారంభమైంది. ఒక వైపు అత్యంత ప్రతిష్ఠాత్మంగా కేసీఆర్ స్వయంగా ప్రకటించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా పట్టించుకోకుండా.. కేసీఆర్ మౌనం.. ప్రచారంలో జోరుగా తిరగాల్సిన నలుగు ఎమ్మెల్యేలు నాలుగు రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం.. బీజేపీ సవాళ్లకు స్పందించే నాథుడే లేకపోవడం వంటి విషయాలతో మునుగోడు పరాజయాన్ని కేసీఆర్ ముందుగానే అంగీకరించేశారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఫలితం తరువాత తెరాస పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది.