పాకిస్తాన్‌కు ఏమయింది?...మళ్లీ చివరి పరుగు చివరి బంతి.. ఓటమి!!
posted on Oct 27, 2022 @ 10:31PM
దురదృష్టం వెన్నాడితే ఎవరేమీ చేయలేరు. ఈసారి టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు దురదృష్టం వెన్నాడింది. మరీ విచిత్రమే మంటే చివరి ఓవర్, చివరి పరుగు దగ్గరే బోర్లాపడుతోంది. ఇది కనీ వినీ ఎరుగని ఓటమి. మొన్న చేజారడం ఏదో దురదృష్టమనే అనుకున్నారు. కానీ గురువారం జింబాబ్వే చేతిలో కూడా ఒక్క పరుగుతోనే ఓటమి పాలవడం, అదీ చివరి ఓవర్ చివరి మూడు బంతుల్లోనే అలా సేమ్ టు సేమ్ జరగడం ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. కానీ వాస్తవం. పచ్చి నిజం, ఇది జరిగింది. ప్రేక్షకు లంతా ముఖ్యంగా పాక్ వీరాభిమానులు ఒక్కసారి గిల్లి మరీ చూసుకున్నారు. నిజమే యే క్యా హువా మసూద్ బై..అనే అను కుంటున్నారింకా. పెర్త్‌లో జరిగిన గ్రూప్ 2 సూపర్ 12 మ్యాచ్‌లో ముందు బ్యాట్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 130 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3, వాసిమ్ 4 వికెట్లు తీసుకున్నారు.
పాక్ జట్టులో జమాజట్టీలున్నారు. ఈ 131 పరుగుల స్కోరెంత ఊదేస్తారనే అనుకున్నారు. నిజంగానే అంతే వేగంగా పరుగులు సాధించారు. స్కోర్ బోర్డు పరుగులు తీసింది. కానీ అప్పుడప్పుడూ వికెట్లు సమర్పించుకున్నారు. అయినా లక్ష్యం దగ్గరయి ఇంకెంత ఇది భారత్‌తో కాదు జాంబాబ్వే మరో క్షణంలో అయిపోతుంది. మనవాళ్లకు సంతోషం పంచుతున్నామనే అనుకున్నా రు. కానీ అదుగో ఆ చివరి రెండు ఓవర్లే కొంప ముంచాయి. మళ్లీ అదే కంగాళీ.
పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ ఒక్కడే అత్యధికంగా 44 పరుగులు చేయగలిగాడు. మిగతా ఎవ్వరూ 22 పరుగులకు మించి చేయలేకపోవడం జింబాబ్వే ఫీల్డింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనను తెలియజేస్తుంది. ముఖ్యంగా బ్రాడ్ ఇవాన్స్, సికిందర్ రజా వంటి బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. మహ్మద్ రిజ్వాన్ (14), బాబర్ ఆజం(4), షాన్ మసూద్(44), ఇఫ్తికర్ అహ్మద్ (5), షదాబ్ ఖాన్ (17), హైదర్ అలీ(0), మహ్మద్ నవాజ్ (22), మహ్మద్ వసీం జూనియర్(12 నాటౌట్), షాషీన్ అఫ్రీది (1) ఊహించని విధంగా పెవిలియన్ దారి పట్టడం పాక్ అభిమానులను, స్టేడియంలో ప్రేక్షకులను ఎంతో ఆశ్యర్య పరిచింది.
చివరి రెండు ఓవర్ల విషయానికి వస్తే.. 22 పరుగులు కావాలి. 19 ఓవర్లో 11 పరుగులు చేశారు. చివరి ఓవర్లో 11 పరుగులు కొట్టాలి. మొదటి బంతికి 3 పరుగులు చేశారు, 2వ బంతికి సిక్స్ బాదారు. 5వ బంతికి నవాజ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. చివరి బంతికి 3 పరుగులు కావాలి. ఒక్క పరుగు తీశాడు.. రెండో పరుగు చేయడంలో షాహీన్ అఫ్రీదీ రన్ అవుట్ అయ్యాడు. అంతే పాక్ శిబిరం దిగాలు పడింది, జింబాబ్వే ఆనందానికి అంతే లేదు. ఊహించని విధంగా ఇలా పాకిస్తాన్ చివరి ఓవర్లోనే మళ్లీ అదీ జింబాబ్వే చేతిలో ఓడిపోవడం పాక్ అభిమానులకు మింగుడు పడటం లేదు.