ఈ సారి ఎన్నికలు చాలా టఫ్.. ఓటమి హింట్ ఇచ్చిన బాలినేని!
posted on Oct 17, 2023 6:39AM
అదేంటో పాపం ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైసీపీ నేతలకు వణుకు పుడుతున్నట్లుంది. ఇప్పటికే తాము సొంతంగా చేయించుకున్న సర్వేలు, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన సర్వేలఫలితాలు, వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజలలోకి వెళ్తే వచ్చిన స్పందన, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనపై ప్రజలలో ఉన్నఅసంతృప్తి అన్నీ తమ కళ్ళతో చూసి.. తమ చెవులతో విన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల పేరెత్తగానే భయంతో వణికిపోతున్నారు. ఆ మధ్య వైనాట్ 175 అన్న ఆ నోళ్లతోనే ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు మామూలుగా ఉండవు.. చాలా టఫ్ అని బాహాటంగానే చెబుతున్నారు. ఈమాటలను చూస్తేనే అర్ధం అవుతున్నది కదా.. వైసీపీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో.
ఆ మధ్య సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి టీడీపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకున్నారా అంటూ పార్టీ కార్యకర్తలనే అడిగారు. మేము గెలిస్తే తాట తీస్తాం అంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని, అందరం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలనువేడుకున్నారు. ఇప్పుడు అదే బాలినేని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, గట్టిగానేపోరాడుతామన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాకుండారాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.
వైసీపీ నేతలకు 2024 ఎన్నికల రిజల్ట్, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోయే పిక్చర్ కూడా క్లియర్ గానే ఉందని
రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. బాలినేని నేడు, అంతకు ముందు మాట్లాడిన వ్యాఖ్యలను విశ్లేషించిన పరిశీలకులు కూడా వైసీపీ ఈసారి ఘోర పరాజయం పాలవ్వడం తనకుతెలుసనీ, కానీ ఇప్పుడే చేతులెత్తేసినట్లుగా వ్యాఖ్యలు చేయడం తీరని నష్టం చేకూరుస్తుందన్న భావనలోనే ఇలా హెచ్చరికల లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈసారిరాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై కూడా పలువురు నేతలు అధిష్టానంగా పిలవబడే పెద్దల వద్ద పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీలోనేఅంతర్గతంగా చర్చించుకుంటున్నారట. అధిష్టానం పెద్దలకు కూడా ప్రస్తుత పరిస్థితులు తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామంటూసీఎం జగన్ మోహన్ రెడ్డిని ఊహల పల్లకిలో ఊరేగేలా చేస్తున్నారన్న గుసగుసలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఈ సోకాల్డ్ పెద్దల మూలంగానే ఇప్పుడు పార్టీకి మరింత నష్టం జరుగుతుందని మిగతా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా అధికార వైసీపీని ఇప్పుడు తీవ్ర నిరుత్సాహం కమ్మేసింది. నిజానికి ఆరు నెలల ముందు నుండి వైసీపీ నేతలకు
తమ ఓటమి అర్ధమైపోయింది. దీంతోనే ఏ కార్యక్రమం నిర్వహించినా కనీస స్పందన కూడా రావడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు టీడీపీ పనైపోయిందని, చంద్రబాబు దోషిగా, ఇక జైలు నుండి బయటకి రాడని ప్రచారం చేసి వైసీపీకి హైప్ తేవాలని చూశారు. ఇందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ, అవేమీ వర్క్ అవుట్ కావడం లేదు. రియాలిటీని కళ్లారాచూసిన వైసీపీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్టు తరువాత వెల్లువెత్తిన ప్రజా నిరసన, ఆగ్రహం చూడటంతోనే వైసీపీ శ్రేణులకు, నేతలకూ కూడా 2024లోతమ ఓటమి ఎలా ఉండబోతోందో కనిపించేసింది. దీంతో కొందరు ఇప్పటికే గోడ దూకేందుకు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉండగా.. వీరంతా ఒక్కసారి చంద్రబాబు బయటకి వస్తేహడావుడిగా కండువాలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక, మరికొందరు అసలు ఈసారి పోటీ చేసేది లేదంటూ ముందుగానేప్రకటించేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లు కనిపిస్తోంది.