తెలంగాణలో కాంగి‘రేసు’.. తగ్గిన కారు స్పీడు!
posted on Oct 17, 2023 @ 10:32AM
ఇంకేముంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ ఇరగదీసింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని శ్రేణులకు నయా జోష్ ఇచ్చినట్లు అయింది. దీంతో తెలంగాణలో పోలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలమధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇరు పార్టీలూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అదే బిల్డప్ ఇచ్చాయి. అలాంటి వేళ ఆ రెండు పార్టీల నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరస్పర విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. అయితే అప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు, పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుండగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో.. ఆ పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా రీచార్జీ అయిపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకొంటుందనే ఓ ప్రచారం తెలంగాణ సమాజంలో చాలా వేగంగా చొచ్చుకు పోయింది.
అలాగే రేవంత్‌రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగిరేసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారన్న భావన సామాన్య జనంలో కూడా బలంగా వేళ్లూనుకుంది. కానీ శతాబ్దానికిపైగా చరిత్ర గల పార్టీలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలను కాకుండా.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం పార్టీలోని సీనియర్లుగా చెప్పుకుంటున్న నాయకులకు సుతరాము ఇష్టం లేకుండా పోయింది.. దీంతో కర్ణాటక ఎన్నికల పలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు సదరు వర్గం.. రెవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది. అలాంటి అసంతృప్తి జీవులను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం నవరత్న తైలంతో వారికి తలంటి మరీ కూల్ చేసింది.
ఇంతలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో టికెట్ల రగడ మొదలైంది. తొలి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తి జీవులంతా ఒక్క సారిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శల బాణాలు సంధించారు.
ఇక ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయన్ని అక్కడ ఓడించి తీరుతామని.. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన ఆసంతృప్తి జీవులంతా భీషణ ప్రతిజ్జలు చేస్తున్నారు. మరోవైపు పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పాతతరం నేతలంతా అసంతృప్తితో జూలు విదిల్చి కదం తొక్కుతున్నారు. అలాంటి వారిలో తాజాగా పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పోన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ బాటలో మరింత మంది నేతలు పయనించే అవకాశం ఉందనే ఓ ప్రచారం సైతం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
ఇంకో వైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయేఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోలేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ పరాజయంతో చతికిలపడిన పార్టీ ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకూడదన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణుల్లో పట్టుదల కనిపిస్తోంది.
కురుక్షేత్రానికి వెళ్లే ముందు పాండవులు జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను దించుకొన్నట్లు తెలంగాణ సెంటిమెంటును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాడుకొంటున్నారనీ, అయితే పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తుడిచేచసిన కేసీఆర్ కు ఈ సారి సెంటిమెంట్ అందివచ్చే అవకాశం లేదనీ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. తన మాటలు పదునుతో.. బీఆర్ఎస్ అగ్రనేతలతో కంగారు పుట్టిస్తుండమే కాకుండా.. పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకు వస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా.. రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాతనే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్ల అసంతృప్తి, అసమ్మతి రాగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్ కు దన్నుగా నిలబడింది.
అయితే హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూప్‌లు, అసంతృప్తి నేతలు, కోవర్టుల కొకొల్లలుగా ఉంటారు. దీంతో వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకు రావడం.. అలాగే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలను వెనక్కి నెట్టి.. తనతోపాటు తన పార్టీ శ్రేణులను ముందుకు తీసుకు వెళ్లి.. రానున్న ఎన్నికల ఫలితాల్లో తన సత్తా చాటు కొంటూ దుమ్ము రేపండం రేవంత్ కు ఇప్పటికీ సవాలేనని పరిశీలకులు అంటున్నారు.