క్లోజ్ అయిన కేసు రీఓపెన్ పిటిషన్.. కక్షకాక మరేంటి?
posted on Oct 17, 2023 6:12AM
ఏదైనా చేయాలి.. చంద్రబాబు జైల్లోనే ఉండాలి. కేసు ఏదైనా కానీ చంద్రబాబును జైలు నుండి బయటకి రాకుండా చేయాలి. ఈ కేసు కాకపోతే మరో కేసు.. ఆ కేసు కాకపోతే ఇంకో కేసు. ఏసీబీ కోర్టు కాకపోతే హైకోర్టు.. హైకోర్టులో ఫెయిలైతే సుప్రీంకోర్టు. లాయర్లకు, వాదనలకు ఖర్చెంతైనా కానీ డబ్బులేమీ మనవి కాదు ప్రజలవే కదా. ఖర్చుఎంతైనా కానీ.. చంద్రబాబు బయటకి రానే కూడదు. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ అధిష్టానం పెద్దల లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి అడ్డగోలుగా కేసుఅలు పెట్టడమే కాకుండా తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా హెచ్చరికలు, బెదరింపులతో చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి.. రాసి పెట్టుకోండి.. స్కిల్ కేసు ఒక్కటే అనుకుంటున్నారేమో.. ఇంకా నాలుగైదు కేసులు ఉన్నాయి. రాసి పెట్టుకోండి చంద్రబాబును బయటకి రాకుండా చేస్తాం అంటూ ఓపెన్ గానే మాట్లాడిస్తున్నారు. దీనిని బట్టే వైసీపీ నేతలు ఎంతగా చంద్రబాబుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమంగా అరెస్టై 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
స్కిల్ కేసు కాకుండా రాష్ట్ర ప్రజలకు చౌకగా ఇంటర్నెట్ అందించేందుకు తెచ్చిన ఫైబర్ నెట్, ప్రతిపాదన తప్ప అసలు రూట్ మ్యాప్ కూడా లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, రౌడీల మూకలతో వైసీపీయే కుట్రలు పన్ని సృష్టించిన అంగళ్ళ అల్లర్ల కేసులు కూడా నమోదు చేశారు. మిగతా కేసులలో ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోగా.. స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. అటు ఇదే కేసులో బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మంగళవారం స్కిల్ కేసులో ఇటు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ చంద్రబాబుకు పాజిటివ్ తీర్పు వస్తుందని భావించారో ఏమో కానీ ప్రభుత్వం అనూహ్యంగా మరో కేసు తెర మీదకి తెచ్చింది. అప్పుడెప్పుడో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టులు సైతం విచారణను పక్కకి పెట్టేసిన అమరావతి అసైన్డ్ భూముల అవకతవకల కేసును ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చే కుట్రకు ప్లాన్ చేశారు. ఈ కేసు రీ ఓపెన్ చేసేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విషయానికి వస్తే 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన సీఐడీ విచారణ కూడా చివరి దశలో ఉంది. ఈ కేసులో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా విచారణను నవంబర్ 1 వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. అయితే , ఇప్పుడు అనూహ్యంగా సీఐడీ ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ మళ్ళీ విచారణ కోరుతున్నది. ఇప్పటికే ఈ కేసు విచారణకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని పిటీషన్ లో సీఐడీ కోరింది. కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీఓపెన్ చేయాలని కోరగా ఈ పిటిషన్లను కూడా కోర్టు విచారించింది. కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది.
అయితే, ఇప్పుడు ఈ కేసులో కూడా వయా నారాయణగా చంద్రబాబును ఇరికించే ప్రయత్నమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లుగా సీఐడీకి దొరకని ఆధారాలు ఇప్పుడే ఎలా దొరికాయని, సీఐడీలోకి కొత్తగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అధికారులే ఇలా ఊడిగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ముగింపు దశకు వచ్చిన ఈ కేసును ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేసి వేధించేందుకే పన్నిన కుట్రగా టీడీపీ ఆరోపిస్తున్నది. అయితే, కేసు ఏదైనా కానీ చంద్రబాబు బయటకి రాకుండా చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు ఇలాంటి కేసులు మళ్ళీ రీఓపెన్ చేయడంపై ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్యగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.