Read more!

బాల్ ఠాక్రే - ఏక్ థా టైగర్

బాల్ థాక్రే.. మడమ తిప్పడం ఎరగని మరాఠా యోధుడు.. తనని తాను అభినవ శివాజీగా ప్రకటించుకున్న సాహసం ఈ ముంబై వాసికి మాత్రమే సొంతం. ముంబైని గడగడలాడించిన అరాచక శక్తుల్ని “ఉ” పోయించిన వీరాధివీరుడు. హిట్లర్ ని ఆదర్శంగా తీసుకుని బతికినంతకాలం ముంబై మహానగరాన్ని శాసిస్తూ పులిలా బతికిన రాజకీయ యోధుడు బాలా సాహెబ్ థాక్రే.

 


 

బాల్ థాక్రే మాటంటే మరాఠీలకు వేదం. బాలా సాహెబ్ నివాసం మాతోశ్రీ మరాఠీలకు ఓ దేవాలయం. ఆయన ఆజ్ఞని తు.చ తప్పకుండా పాటించే మరాఠాలు బాలా సాహెబ్ ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా తాము అనాధలైపోయామన్న భావనకు లోనౌతున్నారు.



 దేశంలో బాల్ థాక్రే అంత చరిష్మా ఉన్న రాజకీయ నేత మరొకరు లేరన్న విషయాన్ని మరాఠీలు చాలా గర్వంగా చెప్పుకుంటారు. మరాఠీ ఏతరులు ముంబైని విడిచివెళ్లిపోవాలంటూ తొలిరోజుల్లో బాల్ థాక్రే చేపట్టిన చిన్న చిన్న ఉద్యమాల ప్రభావం ఇప్పటికీ మరాఠీలందరిమీదా చాలా బలంగా పనిచేస్తోంది.


తొలినాళ్లలో కార్టూనిస్ట్ గా పనిచేస్తూ తన జాతి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న పోరాటాలతో ముందుకు సాగిన బాల్ థాక్రే తర్వాత్తర్వాత ఒక్క ముంబైని మాత్రమే కాక, మొత్తం మహారాష్ట్రనే శాసించ గలిగే స్థాయికి చేరుకున్నారు. ఇండియా లాంటి దేశాన్ని పాలించాలంటే హిట్లర్ లాంటి లీడర్ కావాలంటూ థాక్రే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.



ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించడం బాల్ థాక్రే స్టైల్. థాక్రే ఓ శక్తిగా ఎదగటడానికి ముందు ముంబైలో సామాన్యుల మనుగడ ప్రశ్నార్ధకంగా ఉండేది. అరాచకశక్తుల పదఘట్టనలకింద నలిగిపోతున్న హిందువులను పైకి లేపి మాఫియాని కాలికింద తొక్కిపట్టిన ఘనతని థాక్రే దక్కించుకున్నారు.



ముంబైని ఏలుతున్న స్మగ్లర్లను తొక్కిపట్టడానికి అదే మార్గంలో వెళ్లి తన వాళ్లని ఆ మార్గంలో పాతుకుపోయలా చేసి ముంబై స్మగ్లింగ్ సామ్రాజ్యాన్నికూడా శాసించారన్న ఆరోపణలు వెల్లువెత్తినా నమ్మిన దానికోసం, నమ్ముకున్నవాళ్లకోసం వెనకడుగు వేయని మరాఠా పోరాట యోధుడు బాల్ థాక్రే.

 


 


1966లో థాక్రే స్థాపించిన శివసేన ముంబై మహానగరంలో హిందువులకు అండగా నిలించింది. థాక్రే పిలుపునందుకుని ఆ పార్టీలో చేరిన వేలాదిమంది శివసైనికులు హిందూవర్గాలకు రక్షణగా నిలబడ్డారు. తర్వాతికాలంలో మహారాష్ట్ర గడ్డమీద ఆ పార్టీ అప్రతిహతమైన మహా శక్తిగా ఎదిగింది. ప్రభుత్వాల్ని సైతం శాసించే స్థాయికి చేరింది.

మహారాష్ట్రలో 1995నుంచి బిజెపితో చేతులు కలిపి శివసేన ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిగా బాల్ థాక్రే కనుసన్నల్లోనే నడిచింది. ప్రభుత్వాల్ని సైతం శాసించగలిగే స్థాయిలో ఉన్నా బాలా సాహెబ్ ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాను కింగ్ మేకర్ నని గర్వంగా చెప్పుకున్న థాక్రే పులిలా దర్పాన్ని ప్రదర్శించేవారు.
 

శివసేన వాణిగా పేరుపడ్డ సామ్నా పత్రికలో బాల్ థాక్రే రాసే సంపాదకీయాలు మరాఠీల రక్తాన్ని మరిగించే రీతిలో ఉండేవి. 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులంతా కలిసికట్టుగా ఉండి, మత రక్షణకోసం ఓ ఆత్మహత్యా దళాన్ని ఏర్పాటుచేసుకోవాలంటూ ఇచ్చిన పిలుపు సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని అప్పట్లో ప్రభుత్వం ఆయనమీద మతకలహాలకు బీజం వేస్తున్నారంటూ కేసుకూడా పెట్టింది.


బాల్ థాక్రే వార్ధక్యం ఛాయలు శివసేన పార్టీని బలహీనం చేశాయి. ఆఖరి నిముషంవరకూ పులిలా గర్జిస్తూ మరాఠీలకు ధైర్యాన్ని నూరిపోసిన బాల్ థాక్రే తర్వాతి తరం అంత బలంగా జనంలోకి వెళ్లలేకపోయింది. భార్య గుండెపోటుతో చనిపోయాక థాక్రే దూకుడు తగ్గింది. అదే సంవత్సరం పెద్ద కొడుకుకూడా యాక్సిడెంట్లో చనిపోవడంతో బాబా కుంగిపోయారు.


తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అంత సమర్ధుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. కాస్తో కూస్తో దూకుడుగా వెళ్లగలిగిన మేనల్లుడు రాజ్ థాక్రే, ఉద్ధవ్ తో విభేదాల కారణంగా వేరుకుంపటి పెట్టుకున్నా అంతగా రాణించలేకపోయాడు. బాబా ఆరోగ్యం దెబ్బతిన్న దగ్గర్నుంచీ ఆయనకు దగ్గరగానే ఉన్నా భవిష్యత్తులో పరిస్థితి ఏంటన్నది మాత్రం చెప్పలేని విషయమే.


కొంతకాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బాబా సాహెబ్ ఆరోగ్యం ఈ మధ్య కాలంలో బాగా క్షీణించింది. లీలావతీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సని అందించినప్పటికీ ఆయన పెద్దగా కోలుకోలేకపోయారు. ఆఖరు ఘటడియల్లో తనకి బాగా ఇష్టమైన తన నివాసంలోనే వైద్యులు ఆయనకు సపర్యలు చేస్తూ వైద్యమందించారు.


కొద్దికొద్దిగా స్పందిస్తూ అంతలోనే దిగజారుతూ వచ్చిన ఆరోగ్యం నిలకడగా నిలబడలేకపోయింది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితిని గమనించిన మృత్యువు.. జీవితమంతా పులిలా బతికుతూ అలుపెరగని పోరాటం చేసిన యోధుడికి వీరమరణమనే శరణ్యమని భావించింది. బాలా సాహెబ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.


బాలా సాహెబ్ థాక్రే శకం ముగిసిపోయింది. ముంబై నగరం మూగబోయింది. మహారాష్ట్రం చిన్నబోయింది. బాబా సాహెబ్ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న కోట్లాదిమంది మరాఠీలు అనాధలైపోయారు. మాతోశ్రీ దగ్గరికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. తమ అభిమాన నేత ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని గుండెలవిశేలా విలపిస్తున్నారు.



ఓ సుదీర్ఘ శకం ముగిసిపోయింది. మహోజ్వలంగా వెలిగి ముంబై నగరవాసులకు అరాచక శక్తులను ఎదుర్కునే మనోధైర్యమనే కాంతిని అందించిన దివ్యనక్షత్రం నేలరాలింది. మొత్తం మరాఠా దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.