సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా చిన్నపరెడ్డి!
posted on Feb 4, 2021 @ 4:30PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. సీఎం కేసీఆర్ సొంత గడ్డ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కుదేలైంది కారు పార్టీ. అటు గులాబీ పార్టీగా వరుసగా షాకులిస్తున్న బీజేపీ దూకుడు పెంచింది. నాగార్జున సాగర్ లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తమకు గట్టి పట్టున్న నాగార్జున సాగర్ లో సత్తా చాటాలని చూస్తోంది. దీంతో తమకు సిట్టింగ్ స్థానమైన సాగర్ ను నిలబెట్టుకోవడం అధికార పార్టీకి సవాల్ గా మారుతోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికతోనే భవిష్యత్ రాజకీయ మనుగడ ఉంటుందనే భావనలో ఉన్న గులాబీ బాస్.. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ టికెట్ తమకే వస్తుందనే ధీమాలో ఉన్నారు దివంగత ఎమ్మెల్యే నోముల భగత్. మంత్రి జగదీశ్ రెడ్డి క్లాస్ మేట్, లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. సాగర్ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే అన్ని అంశాలు పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేశారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
టికెట్ ఎంపికలో కేసీఆర్ గతంలో ఎప్పుడు లేనంతగా కసరత్తు చేశారని తెలుస్తోంది. నోముల భగత్ పేరు పరిశీలించినా... దుబ్బాక ఫలితం అధికార పార్టీని భయపెడుతుందని చెబుతున్నారు. దుబ్బాకలో దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణకి టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆమెనే పార్టీ మైనస్ అయ్యారని గులాబీ నేతలు అంచనాకు వచ్చారు. సాగర్ లోనూ భగత్ కు టికెట్ ఇస్తే అలాంటి ఫలితం వస్తుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ పెద్దల్లో ఉందట. భగత్ కు రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ గా ఉందంటున్నారు. ఎంసీ కోటిరెడ్డి పేరును మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపాదిస్తున్నా.. అతనికి నియోజకవర్గంలో పలుకుబడి లేదని కేసీఆర్ సర్వేలో తేలిందట. అంతేకాదు నియోజకవర్గ ప్రజల్లో కోటిరెడ్డిపై వ్యతిరేకత కూడా ఉందని రిపోర్టు వచ్చిందంటున్నారు.
శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని సాగర్ లో పోటీ చేయించాలని కేసీఆర్ ముందు భావించారని తెలుస్తోంది. మే నెలలో ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుండటంతో .. ఉప ఎన్నిక బరిలో నిలపాలని ఆలోచించారట. అయితే సాగర్ లో పోటీ చేయడానికి పార్టీ పెద్దల ముందు గుత్తా కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తనకు కేబినెట్ లో చోటు కల్పిస్తామని హామీ ఇస్తేనే సాగర్ లో పోటీ చేస్తానని కేటీఆర్ తో గుత్తా చెప్పారని సమాచారం. దీంతో గుత్తా అభ్యర్థిత్వంపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఒకరికి అలాంటి హామీ ఇస్తే.. ముందు ముందు సమస్యలు వస్తాయని గులాబీ పెద్దలు భావించారని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి లేదా ఆయన తనయుడు బరిలో ఉండే అవకాశం ఉంది. జానారెడ్డి గతంలో ఇక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయనకు చాలా పట్టుంది. ఆర్థికంగానూ బలవంతుడు. అందుకే జానారెడ్డి లాంటి ఉద్దండ లీడర్ ను ఎదుర్కొవాలంటే ఆర్థికంగా బలవంతుడైన తేరా చిన్నపరెడ్డి అయితేనే కరెక్టుగా ఉంటుందనే అంచనాకు కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది. అంతేకాదు చిన్నపరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో కొంత సెంటిమెంట్ కూడా ఉంది. 2009 నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పలు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నల్గొండ ఎంపీగా కూడా బరిలో నిలిచారు. కాని ఎప్పుడూ గెలవలేదు. ఎన్నికల్లో పోటీ చేసి భారీగా డబ్బులు ఖర్చు చేశారని ప్రజల్లో ఆయనపై సానుభూతి ఉంది. ఇది కూడా తమకు కలిసివస్తుందని గులాబీ బాస్ లెక్కలేస్తున్నారని చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.
మరోవైపు తేరా చిన్నపరెడ్డికి బీజేపీ నేతలు గాలం వేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే నాగోల్ లో బీజేపీ ముఖ్యనేతలతో చిన్నపరెడ్డి సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి. నాగార్జున సాగర్ టికెట్ ఇస్తామని కమలం పార్టీ ఆయనకు ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలతో సమావేశం జరిగిందన్న వార్తలను ఖండించారు చిన్నపరెడ్డి. కాని బీజేపీ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నది నిజమేనని తేరా సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అలర్టైన టీఆర్ఎస్ పెద్దలు.. తేరాతో మాట్లాడి కూల్ చేశారనే చర్చ కూడా తెలంగాణ భవన్ లో జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలని అప్పుడే ఆయనకు కేటీఆర్ చెప్పారని కూడా చెబుతున్నారు.