సింహయాజి స్వామి అలియాస్ అశోక్ ఒక ఫ్రాడ్..!
posted on Nov 4, 2022 @ 6:13PM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు ఒక్క తెలంగాణ రాష్ట్రాంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు, పదవులు, కాంట్రాక్టులు ఇవ్వ జూపారనీ, ఇందు కోసం డీల్ కుదుర్చుకునేందుకు అడ్వాన్స్ సొమ్ములతో మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు బీజేపీ దూతలు వచ్చి బేరసారాలాడారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ వీడియోలను కూడా విడుదల చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా బీజేపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ బీజేపీ దూతలని చెబుతున్న ఆ ముగ్గురిలో ఒకరు సింహయాజ స్వామి. ఆయన నిజంగా స్వామీజీయేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఆయన గత, వర్తమానాలను పరిశీలిస్తే ఆయన వాస్తవంగా స్వామీజీ కాదనీ, ఆయనకు వెనుక పెద్ద నేర చరిత్రే ఉందని తెలుస్తోంది. స్వయంగా సింహయాజి స్వామికి స్వయాన పెదనాన్న ఈ సింహయాజి స్వామి బాగోతం అంతా చెప్పారు. చాలా చిన్న వయస్సులోనే సింహయాజి స్వామిని రమణారావు అనే వ్యక్తి దత్తతకు తీసుకున్నారు. సింహయాజి స్వామి అసలు పేరు అశోక్.. అన్నమయ్య జిల్లా అయ్యవారి పల్లి ఆయన స్వస్థలం. అయితే పదేళ్ల కిందటే అశోక్ అలియాస్ సింహయాజి స్వామి స్వగ్రామం వదిలి తిరుపతి వెళ్లిపోయారు.
ఇంటర్ వరకూ చదివిని సింహయాజి స్వామి ఒక ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పని చేశారు. ఆ సమయంలోనే స్వగ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత దాదాపు ఏడెనిమేళ్ల కిందట ఆయన స్వామీజీ అవతారం ఎత్తి పేరును సింహయాజి స్వామిగా మార్చుకున్నారు. ఇందుకు ఆయన చెన్నైకి చెందిన చతుర్వేది స్వామిని ఆశ్రయించి పీఠాన్ని స్థాపించి పీఠాధి పతి అయ్యారు.
అయితే ఈ సిహయాజి స్వామి పీఠం ఏమిటో.. అక్కడేం చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. ఒక ఇంటిని చూపి అదే పీఠం అని చెబుతారు. ఆ పీఠానికి సింహయాజ స్వామి ఎప్పుడో కానీ అదీ అర్దరాత్రి వేళ మాత్రమే వస్తుంటారని సాయంత్రం చెబుతారు. ఇక దేవగుడి పల్లిలో వెయ్యేళ్ల నాటి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తానంటూ అందరినీ నమ్మించారు. కోట్ల రూపాయల వ్యయానికి కూడా సిద్ధమేనంటూ నమ్మబలికే వారు. అయితే పురాతన ఆలయ పునర్నిర్మాణం పేర గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక సారి అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుంటే జనం సింహయాజి స్వామిని తరిమికొట్టారు.
ఆ గుడి ఆర్కియాలజీ శాఖకు సంబంధించిన గుడి కావడంతో రాయచోటికి చెందిన న్యాయవాది రాజేశ్వరి కుమార్తె ఆర్కియాలజీ శాఖకు ఫిర్యాదు చేయడంతో సింహయాజి స్వామి ఆగడాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సింహయాజి స్విమి అలియాస్ అశోక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడు మానసిక వికలాంగుడు. భార్యా పిల్లలను పట్టించుకోకుండా తిరిగే సింహయాజి స్వామి ఒక ఫ్రాడ్ అని స్వయానా ఆయన పెదనాన్నే చెప్పారు. తిరుపతిలో ఉండి సింహయాజి స్వామి ఏం చేశాడో ఎవరికీ తెలియదని ఆయన పేర్కొన్నారు.
అదో రహస్యం అన్నారు. ఎలాగోలా పీఠాధిపతి అయ్యి నామాలు పెట్టుకుని పూజలూ, యాగాలూ చేస్తూ వచ్చాడని సింహయాజి స్వామి పెదనాన్ని చెప్పారు. ఏం చేస్తాడో, ఏక్కడ తిరుగుతాడో తెలియదు. ఎలా బతుకుతున్నాడో తెలియదని సింహయాజ స్వామి పెదనాన్న చెప్పారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న సింహయాజ స్వామి ఎలా బీజేపీ తరఫున ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు దూతగా మారాడో అర్ధం కాదని అంటున్నారు. కాగా సింహయాజస్వామికి ఎమ్మెల్యే పైలట్ రెడ్డి భక్తుడని తరచూ కలుస్తుంటారని అంటున్నారు.
మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరు ఎవరి తరఫున ఉన్నా రంగంలో ఉన్నది మాత్రం క్రిమినల్స్ అని సామాన్యులు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆయనకు బీజేపీలోని ఒక అగ్రనేతతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతుంటే.. బీజేపీ వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన భక్తుడని చెబుతున్నారు. నిజానిజాలెలా ఉన్నా దేశాన్ని కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఒక ఫ్రాడ్ కీలక పాత్ర వహించడమే కొసమెరుపు.