అవినాష్ ముందస్తు బెయిలు రద్దు.. వివేకా హత్య కేసు దర్యాప్తు గడువు పొడగింపు
posted on Apr 24, 2023 @ 4:02PM
అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాతపూర్వకంగానే ప్రశ్నలు అంటూ ముందస్తు బెయిలు సందర్బంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ.. అలా అయితే ఇక సీబీఐ అవసరమేమిటి అని సుప్రీం సీజేఐ ధర్మాసనం వ్యక్తం చేసింది.
ఇన్ని వ్యాఖ్యలు చేసిన అనంతరం సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు చేసిన మధ్యంతర ముందస్తు బెయిలును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాదు.. ఈ నెల 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తును ముగించేయాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తూ.. జూన్ 30 వరకూ గడువు పొడిగించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక అవినాష్ ను సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అసలు తెలంగాణ హైకోర్టు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై న్యాయనిపుణులే కాదు.. వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్యులనే ఆశ్చర్య పరిచింది. టీవీ టాక్ షోలలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ చివరి నిముషంలో మరో బెంచ్ కు మారడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు.
మొత్తం మీద హైకోర్టులో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్టు నుంచి తాత్కాలికంగానే అయినా ఊరట లభించడం వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలే అందరిలో వ్యక్తమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వివేకా హత్య కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడం, హతుడు వివేకానందరెడ్డి స్వయంగా ఏపీ సీఎం జగన్ కు బాబాయ్ కావడంతో ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అసలు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలును సీబీఐ సుప్రీంలో సవాల్ చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా వివేకా కుమార్తె సుప్రీంను ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేశారు.
తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఆ ఊరట అవినాష్ కు లభించలేదు. ముందస్తు బెయిలు ఉత్తర్వులతో పాటే.. ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో ముందస్తు బెయిలు పొందిన నాటి నుంచీ అవినాష్ ప్రతి రోజూ సీబీఐ కార్యాలయానికి వెళ్లి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీం ఆ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టి వేయడంతో సీబీఐ ఆయనను అరెస్టు చేయడం ఖాయమని తేలిపోయింది. అరెస్టు చేసి ఆ తరువాత అవినాష్ ను సీబీఐ కస్టడీకి కొరే అవకాశాలు ఉన్నాయి.