రగులుతున్న రాయలసీమ
posted on Apr 24, 2023 @ 4:30PM
పాతికేళ్ల క్రితం వరకూ ఫ్యాక్షన్ కే పరిమితమైన రాయలసీమ ఇప్పుడు రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. బాషాప్రయోక్త రష్ట్రాల ఏర్పాటు తరువాత రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు సుమారు 30 సంవత్సరాలు పాలించారు. ఏడుగురు ముఖ్యమంత్రులను రాయలసీమ అందించింది.
ప్రస్తుతం రాయలసీమ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్న సీమ నేతలను తమ వాదనలకు పదును పెంచారు. తాజాగా జేసీ దివాకరరెడ్డి చేసిన ప్రకటన కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్న జేపీ వాదన కొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని జేసీ అంటున్నారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు సీనియర్ నేత ఎంవి మైసూరారెడ్డి గ్రేటర్ రాయలసీమ ప్రతిపాదన చేశారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని రెండు రెవెన్యూ డివిజన్లతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు అప్పట్లో తెరమీదకు వచ్చింది. ఇదే కాక రాయలసీమ, తెలంగాణలు కలిపి రాయల్ తెలంగాణ ఏర్పాటుపై కొన్నిఅభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కావలసిన ఆర్థిక వనరులు, సహజ వనరులు, జల వనరులు తమకు ఉన్నాయంటున్నసీమ నేతలు ఇతర ప్రాంతాల వారు తమ హక్కులను, వనరులను దోపిడీ చేస్తున్నారని సీమ నేతలు ఇరోపిస్తూనే ఉన్నారు.