అవినాష్ అరెస్టే ఇక తరువాయి!
posted on Apr 24, 2023 @ 3:43PM
అందరూ అనుకున్నట్లుగానే అయ్యింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఈ కేసులో అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే.
అయితే.. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలన్న ఆదేశాలను సడలిస్తూ గడువును జూన్ 30 వరకూ పొడిగించింది. ఇక వివేకా హత్య పూర్వాపరాల లోకి వెళితే.. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సిట్ దర్యాప్తు నుంచి సీబీఐ దర్యాప్తు దర్యాప్తు వరకూ వివేకా హత్య కేసులో వేలు పెట్టని దర్యాప్తు సంస్థ లేదు. జిల్లా కోర్టు నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కూడా వివేకా హత్య కేసు వాదనలు జరిగాయి, జరుగుతున్నాయి. వైఎస్ కుటుంబంలో జరిగిన హత్య కావడంతో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను దుమారాన్ని సృష్టిస్తోంది.
మందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టు తలుపు తట్టడంతో ఆయనను ఏప్రియల్ 22 వరకూ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు వచ్చాయి. వివేకా కుమార్తె సునీత ముందస్తు బెయిల్ ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 21వ తేదీన విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను సోమవారం (ఏప్రిల్ 24)కు వాయిదా వేసింది.
ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అవినాష్ ముందస్తు బెయిలుపై హైకోర్టు ఆదేశంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది. దీంతీ అవినాష్ రెడ్డి అరెస్టు ఇక లాంఛనమే అంటూ తెలుగువన్ గతంలోనే ప్రచురించిన వార్త నిజమైంది.