ఆక్రోటు తింటే మూడ్‌ బాగుంటుంది

ఆక్రోటు పప్పు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఇంత ఆక్రోటు పప్పు నోట్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఆక్రోటు తినడం వల్ల సంతోషంగా ఉంటారన్న విషయం కూడా ఇప్పుడు రుజువైపోయింది.

 


పీటర్ ప్రిబిస్‌ అనే ఓ పరిశోధకుడు రొజూ ఆక్రోటు పప్పు తినడం వల్ల మనసు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయన ఓ 64 మంది విద్యార్థుల మీద ఒక పరీక్షను నిర్వహించాడు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు ఉన్న ఈ విద్యార్థులంతా ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వీరిని పదహారు వారాల పాటు రొజూ ఓ మూడు బ్రెడ్‌ ముక్కలు తినమని చెప్పారు. ఇందులో ఓ ఎనిమిది వారాల పాటు మామూలు బ్రెడ్‌ను తినమనీ, మరో ఎనిమిది వారాలపాటు ఆక్రోటు పొడి కలిపిన బ్రెడ్‌ ముక్కలు తీసుకోమనీ చెప్పారు.

 


సాధారణంగా విద్యార్థి దశలో ఉండేవారు చాలా ఉద్విగ్నతగా ఉంటారు. సవాలక్ష సమస్యలతో చిరాకుపడుతూ ఉంటారు. వారి మనసుని కనుక ప్రశాంతంగా ఉంచగలిగితే ఆక్రోటు విజయం సాధించినట్లే! అందుకనే Profiles of Mood States (POMS) అనే పరీక్ష ద్వారా వారి మూడ్‌ ఎలా ఉందో గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఈ పరీక్షతో ఒక వ్యక్తిలోని ఉద్విగ్నత, క్రుంగుబాటు, కోపం, నిస్సత్తువు వంటి లక్షణాలను గమనించడం ద్వారా కొన్ని మార్కులు వేస్తారు. ఈ మార్కుల మొత్తాన్నీ Total Mood Disturbance score (TMD) అంటారు. ఈ TMD ఎంత తక్కువగా ఉంటే మన మూడ్ అంత బాగున్నట్లు లెక్కట!

 


ఆక్రోటు పొడి కలిపి ఉన్న బ్రెడ్‌ను తిన్న విద్యార్థులలో TMD విలువలు చాలా తక్కువగా నమోదు కావడాన్ని గమనించారు పరిశోధకులు. మిగతావారితో పోలిస్తే వీరి మూడ్ దాదాపు 30 శాతం సానుకూలంగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ మార్పు కేవలం మగవారిలోనే కనిపించడం విశేషం. ‘గతంలో ఆక్రోటు తినడం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయనీ, డయాబెటిస్ అదుపులో ఉంటుందనీ, ఊబకాయం మీద కూడా ప్రభావం ఉంటుందనీ తేలింది. అందుకనే ఈసారి వారి మనసు మీద ఆక్రోటు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేశాము,’ అంటున్నారు పీటర్.

 


ఆక్రోటులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల.... అవి క్యాన్సర్‌ దగ్గర్నుంచీ చర్మవ్యాధుల వరకూ మన శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. అయితే అందులో ఉండే విటమిన్‌ ఇ, ఫోలేట్ యాసిడ్, మెలటోనిన్, ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్ అనే రసాయనాల వల్ల మన మూడ్‌ కూడా మెరుగుపడుతుందని తాజా పరిశోధనతో తేలిపోయింది. మరింకేం! నిరంతరం ఏవో ఒక చిరాకులతో సతమతం అవుతూ ఉండేవారు, రోజుకో రెండు ఆక్రోటు పప్పులు నములుతూ ఉంటే సరి!

 

- నిర్జర.