'రాజకీయ నిరుద్యోగుల' పదవీకాంక్ష వల్లే ఉద్యమ వైఫల్యం !
posted on Jan 31, 2013 @ 10:21AM
డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
అది 2011 సంవత్సరం, జనవరి నెల 16వ తేదీ. ఆరోజున తెలుగు పత్రికలు, ఛానళ్లు ఒక ప్రకటనను విడుదల చేశాయి, ప్రసారం చేశాయి. ఆ ప్రకటన కర్త పేరు 'ఊసరవెల్లి' రాజకీయాలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతీయవాది, కాదు, శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగువారి తెలంగాణా ప్రాంతానికి చేరిన పెద్ద వలసదారు. అతడిపేరు కె.సి.ఆర్ అనే ఒక 'బొబ్బిలిదొర' ! రాజకీయ నిరుద్యోగ రోగంతో చాలాకాలంగా తీసుకుంటున్న ఇతడు చేసిన ప్రకటనే అది. కాని తాను ఆనాడు చేసిన ఈ ప్రకటన తిరిగి తనకే ఎదురు తగులుతుందని అతడు వూహించి ఉండడు. ఏమిటా ప్రకటన: "తెలంగాణాకు శాపం తెలంగాణా ప్రాంత నేతలే. వీళ్లకు చీమూ, నెత్తురూ లేదు, వీళ్లు దద్దమ్మలు అని దూషించాడు కె.సి.ఆర్ ! కాని ఏ తెలంగాణాలోని ప్రస్తుత నాయకుల్ని ఏ కె.సి.ఆర్ మూడేళ్లనాడు దూషించాడో, ఆ కె.సి.ఆరే తెలంగాణా తెలుగు వారికే గాదు, యావత్తు తెలుగుజాతి ఉనికికీ, ఉసురుకే పెద్ద శాపంగా మారాడు. ఎలా? ఆ "చీమూ, నెత్తురూ" లేవనే కేంద్రకాంగ్రేస్ నాయకత్వంతో విశాలఖత రాజకీయాలకు దిగి, ఏ తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ వ్యక్తి తన రాజకీయ నిరుద్యోగం వల్ల, ఏ ముఖ్యమంత్రి పదవిని ఆశించి ఇంతకాలం దశాగతి, దిశాగతి లేని వేర్పాటు ఉద్యమాన్ని నడిపిస్తూ చివరికి "చుక్కా లేని నావ" గా తయారు చేశాడో ఆ కె.సి.ఆర్ కాంగ్రెస్ చంకలో దూరిన ఫలితంగా ఉద్యమాన్ని నట్టేటముంచాడు. అందువల్ల 'దద్దమ్మలు"గా తెలంగాణా తెలుగు నాయకుల్ని ప్రజలలో చిత్రించడం ద్వారా ఆ ఆఖరికి ఎవడు "దద్దమ్మ" గా మిగిలిపోయారో యావదాంధ్రప్రజలకు తెలిసిపోయింది.
యావదాంధ్ర(తెలుగు) జాతిని ఒక్క తాటిపైన నిలిపిన శాతవాహన, కాకతీయ, కూలీ కుతుబ్ షాహీల కాలం మినహాయిస్తే వాళ్లు ఆ సమైక్యతకు వారధి కట్టిన మరపురాని చారిత్రక మహత్తర ఘట్టం - తెలంగాణా సాయుధపోరాటం మాత్రమేనని గుర్తించాలి. ఇది మూడు ప్రాంతాల ప్రజల తపన ఫలితంగా, అనుపరిత్యాగాల మూలంగా, యావత్తు తెలుగుజాతి చిరకాల ఆకాంక్ష ఫలితంగా వచ్చిన పరిణామం. ఇది మరెవరి దయాదాక్షిణ్యాల వల్లనే సిద్ధించిన పరిణామంకాదు. ఈ చరిత్రలో మిలితంలేనివాడు ఈ 'బొబ్బిలిదొర', వలసపెత్తందారు ! తెలంగాణా ప్రాంతానికి ఏ తెలంగాణా ప్రాంతనాయకులే 'శాపం' అని ఈ 'దొర' పలికాడో ఆ శాపపు వారసుడు కూడా ఆ 'దొరే' అయ్యాడు. కనుకనే పదవీ రాజకీయం కోసం గతంలో వేర్పాటు ఉద్యమాన్ని నిర్మించిన మర్రిచెన్నారెడ్డి పదవి దొరికిన మరునాడే ఆ ఉద్యమాన్ని విరమించడమేగాక, "ఇకముందు ప్రత్యేక తెలంగాణా ప్రసక్తి లేదని" బహిరంగంగా చాటినవారని నేటి ఉద్యమకారులు మరవరాదు. సరిగ్గా అదే బాటలో నేటి 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్ఠానంతో మంతనాలాడిన ఫలితంగా ఢిల్లీలో నెలరోజులు పడిగాపులు పడిఉన్న దాని ఫలితం - కాంగ్రెస్ లో తన వేర్పాటు ఉద్యమ పార్టీ అయిన టి.ఆర్.ఎస్ కు విలీనం చేయడానికి సంసిద్ధత ప్రకటించడమూ, అందుకు తగినట్టు వేర్పాటు ఉద్యమాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడానికి 'మేధోయధనం'లో తలమున్కలై ఉండడాన్ని కూడా తెలుగుజాతి గమనిస్తోంది ! సోదర తెలుగువారిపైన అబద్ధాలతో, వంచనతో, జాతులతో, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో ఇతడు ప్రాంతాలలోని తెలుగు ప్రజలమధ్య వైషమ్యాలను, విద్వేషాన్ని కల్గిస్తూ ఉద్యమాన్ని కె.సి.ఆర్ నిర్మించాడు!
'ఇదిగో తెలంగాణా రేపే వస్తుంది, నేడేవస్తుంది,లేదా ఎల్లుండి వస్తుంది, లేదా కొలది రోజుల్లో రాబోతోంది" అంటూ ఏళ్లు వూళ్లు గడుపుతూ, తప్పుడు హామీలపై యువతలో భ్రమలు భారీస్థాయిలో కల్పించి, వందలాదిమంది యువకుల్ని భంగపెట్టి ఆత్మహత్యలకు ప్రోత్సహించాడు. ఫలితం? మొత్తం ఉద్యమం గాడి తప్పింది. కె.సి.ఆర్ నాయకత్వంలో ఎక్కడ ఉద్యమం బందీ అయిపోతుందోననుకుని భ్రమలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణా కాంగ్రెస్ అని ఒకడూ, చిన్న రాష్ట్రాల పేరిట రాజకీయ అవినీతిలోకి, అనిశ్చితిలోకి, నిత్యసంక్షోభంలోకి ఏ చత్తీస్ ఘడ్ , జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నెట్టిన బి.జె.పి., మొత్తం తెలుగుజాతి ఐక్యతకోసం ఏ రైతాంగసాయుధపోరాటం ద్వారా రాజకీయ నాయకత్వాన్ని ఏ కమ్యూనిస్టుపార్టీ అందించిందో చివరికి ఆ కమ్యూనిష్టు పార్టీ యే తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడంకోసం కంకణం కట్టుకొన్నది., ఎటూ తేల్చుకోలేని "తెలుగుదేశం" నాయకత్వమూ రెండుగా చీలి సంక్షోభాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తోంది., తెలంగాణా సాయుధపోరాట లక్ష్యాలలో ఒకటిగా ఉన్న తెలుగుజాతి సమైక్యతా రాష్ట్ర సాధనకు దోహదం చేసిన ఉమ్మడికమ్యూనిస్టు పార్టీలోని మరొక వర్గం - మార్క్యుస్టు పార్టీ - సమైక్యతకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఏదైనాసరే "కేంద్రమే తేల్చాలన్న" నినాదాన్ని కూడా అదే సమయంలో పదేపదే ఉచ్చరిస్తూ నీళ్లు నమలుతోంది! ఇలా తలా ఒకడూ తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి తలా ఒక సమిధవేసి తెలుగుజాతిని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం మాత్రం ఏం చేయగల్గుతుంది? అక్షిలపక్ష సమావేశాలు కూడా అధికార తాపత్రయంతో భాగమైపోయాయి ! అందరివీ పదవీరాజకీయాలే, "వోట్లు, - సీట్లు" నిష్పత్తిలో తెలుగుజాతి భవితవ్యాన్ని తక్కెటలో పెట్త్రి తూస్తూ నిర్ణయించే అధికారం ఏ రాజకీయ నిరుద్యోగులకూ లేదు. తీరా ఇప్పుడు తాజాగా వినపడుతున్న నినాదం - "అన్నదమ్ముల్లా విడిపోదాం, తెలుగువారిగా మంచిగా ఉందాం" అని! విషప్రచారంతో "ఉద్యమం పేరిట" మూడు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్రమైన మనస్తాపానికి, వైషమ్యానికి బీజాలు నాటిన ఈ పనికిమాలిన ప్రజావ్యతిరేక రాజకీయ నిరుద్యోగులు తిరిగి అన్నదమ్ముల్లా ఉండే పరిస్థితిని కల్పించగలరా? మూడుప్రాంతాల ప్రజాబాహుళ్యంలో ద్వేష భావం లేదు, ఉండడు. కాని మనస్సులను కలపవలసిన రాజకీయపక్షాలూ వాటి నాయకులూ ఈ ముఖ్యమైన విషయాన్ని మినహాయించి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం వీరంగాలు వేశారు, వేస్తున్నారు. వీళ్లకి ప్రగతికి, వెనుకబాటు తనానికి కారణాలు తెలుసుకునే ఓపిక లేక లెక్కలూ, డొక్కలూ వద్దని చెప్పి బొక్కలు మాత్రం వోపికతో వెతుకుతున్నారు! వీళ్లే ప్రజలపాలిట అసలు 'శాపకులు'! కనుకనే ఆది నుంచీ చిదంబరం నోట వెలువడిన "డిసెంబర్ 9" నాటి "ప్రాసెస్" పదాల్ని నేడు కేంద్రమంత్రులు షిండే, ఘులామ్ నబీ ఆజాద్ లు చేసిన ప్రకటనలకు ["చర్చలు యింతే విస్తృతంగా సాగాలి, ఒక్క రోజుతో తేలే సమస్య కాదు".] చోటా మోటా నాయకులుగా వికృతార్థాలు తీసి, తమను తాము వంచించుకుని, తెలుగు ప్రజలను మరిన్ని భ్రమలలో తినెడుతూ వస్తున్నారు.
తీరా కోరుకుంటున్న ఆ "జనవరి 28" ముహూర్తం రానే వచ్చింది. తీరావచ్చి తేల్చిందేమిటి? తెలంగాణా "వేర్పాటు సమస్య"ను తొందరపడి తేల్చేదిలేదు, మరొకసారి చేతులు కాల్చుకునేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తెగేసి చెప్పింది ! ఎందుకని? ఒకటిగా ఉన్న తెలుగుజాతి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని (ఆంధ్రప్రదేశ్) చీల్చడం అసహజం, అస్వభావికం కాబట్టి ! అంటే, చిదంబరం"ప్రాసెస్" అన్నా, లేదా మూడు ప్రాంతాల సీనియర్ నాయకులతో కూలంకుష పైన చర్చలు జరగాలన్నా అర్థం ఒకటే అన్ని కోణాల నుంచి "సమస్య"ల్ని చర్చించకుండా "లేడికి లేచిందే పరుగు" అన్నట్టుగా ఏ సమస్యను ఆదరాబాదరా తేల్చడం సాధ్యంకాదని స్పష్టంగా చెప్పడమే. "ఉద్యమం" ఆడు నుంచీ జరుగుతున్న పెద్దలోపం, క్షమించరాని నేరం - వేర్పాటునాయకులు విద్యార్థియువతను గాని, ప్రజాబాహుళ్యాన్ని గాని భౌద్ధికంగా చైతన్య వంతులను చేయగల వాస్తవ సమాచారాన్ని వారికి అందించకపోవడమూ, నినాదలనే 'విద్యాగంధం' గా పంచిపెట్టడమూ! తీరా ఇప్పుడు వేర్పాటు నాయకుల పని "కుడితిలో పడ్డ ఎలుక" చందంగా తయారయింది. ప్రజలకు యువతకు నాయకత్వం చెప్పలేని, వివరించాలో లేని దుస్థితి. తాముగా సృష్టించుకున్న ఈ దుర్గతి నుంచి బయటపడేందుకు చేస్తున్న మరిన్ని తప్పిదాలు - తమ భవిష్యత్తు తప్ప విద్యార్థి, యువత, పేద, బడుగు, బలహీన వర్గాల మౌలిక ప్రయోజనాలును నట్టేట ముంచే "పరువురక్షణ" చర్యలు! వీళ్లకి విద్యార్థుల భవిష్యత్తు లేకపోయినా ఫర్వాలేదు, బలిదానాలు యువతవంతు, తమకు, తమ ప్రాణరక్షణ ప్రధానం! కోటికి పడగలెత్తే దొరలు భూస్వాములు, పాత జాగిర్దార్లు రాజకీయ నిరుద్యోగులూ తమ ఓటమిని సహించలేరు, కనుకనే వారికి వేర్పాటు ఉద్యమాన్ని వదులుకోలేరు. సీట్లు - వోట్లు మీద పేకాట ఫక్కీలో జూదం ఆడడానికి నాయకులు అలవాటు పడినంతకాలం నలిగిపోయేదీ నలిగిపోతున్నది బడుగు బలహీన వర్గాలు మాత్రమే.
కనుక వామపక్షాలన్నా ఒక్క తాటిమీద ఈ సమస్యపై ఉండిడింటే జూదగొండు రాజకీయులు ఏనాడో కట్టుబడిపోయేది; సిపిఐ నారాయణ ఏం మాట్లాడుతున్నాడో, సుధాకరరెడ్డి ఏం చేస్తున్నాడో వారికే తెలియని పరిస్థితి; ఇక సిపిఎం రాఘవుల గొంతు కూడా ఉండవలసినంత బలంగా వినిపించడంలేదు. వేర్పాటు వాదంలో నాలుగైదు పార్టీల నాయకుల లక్ష్యం తెలంగాణా ప్రయోజనాలుగాని, తెలుగుజాతి బాగోగులు కాని కాదు - కేవలం పార్టీల ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో అనాలోచితంగా వేర్పాటు వాదానికి అందచేస్తున్న అనుచితమైన, ప్రమాదకరమైన అండదండలు! ఇంత త్వరలో అంతటి కమ్యూనిస్టుపార్టీ. ఇంతగా దిగజారిపోతుందనీ, తెలుగు వంగడానికి వేరు పురుగుగా అవతరిస్తుందనీ ఎవరూ వూహించి ఉండరు ! ఇక మావో పేరుతో ఉన్న భారత మావోయిస్టు పార్టీ వారు, 'చైనాలో ఒక్క తాటిపైన ఉన్న ఏ భాషా రాష్ట్రాన్ని మావో చీలదీశాడు. ఒక్క ఉదాహరణనైనా చూపగల స్థితిలో లేరు. చివరికి విమోచనోద్యమంలో రక్షణదుర్గంగా ఒక స్థావరం అవసరమైనప్పుడు ఏ గుహా జీవితాన్నో మావో గడిపినవాడే గాని జాతిని చీల్చిన వాడుకాదు; ఇక "న్యూడెమోక్రసీ" పేరిట ఉన్న మార్కిస్టు - లెనినిస్టు పార్టీ కూడా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడి పనిచేస్తున్న పార్టీగా తెలంగాణాలో ఉనికి కోసం తంటాలుపడే మార్గంలో తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికే సంకల్పించి అభాసుపాలయింది ! ప్రజల మధ్య వైరుధ్యాల్ని పరిష్కరించడంలో ప్రజలనే నిలువునా చీల్చమని ఏనాడూ చెప్పలేదు !! ఇంతకూ మనసమస్యల్లా - రాష్ట్ర సమస్య అనే కాదు యావద్భారత సమస్యలకు సామరస్యమైన సుహృద్భావ పరిష్కారమార్గాలు చూపగల స్థాయిగల జాతీయ నాయకత్వం కొరవడడమే. ఢిల్లీ నుంచి మన గల్లీల వరకూ మనం చూస్తున్న నేటి నాయకత్వాలు మరుగుజ్జులూ, కేవల"మైకాసురులూ", భావ శూన్యాలూ, వాచాలురూ, కడుపుల్లో కత్తెరలూ, నోళ్లలో చక్కెరలూ దాచుకున్న సరుకుకేనంటే ఎవరూ బాధపడనక్కరలేదు!