కేంద్రం మౌనం.. ఏపీలో బీజేపీకి డ్యామేజ్!
posted on Sep 17, 2022 @ 10:26AM
మూడు రాజధానుల విషయంలో వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. జనం వ్యతిరేకిస్తున్నా.. కోర్టులు మొట్టికాయలు వేసినా, చివరాఖరికి నిన్న మొన్నటి దాకా అన్నందాలా అండగా నిలిచిన బీజేపీ సైతం అమరావతే ఏకైక రాజధాని అని నిక్కచ్చిగా చెబుతున్నా జనం తీరు మారడం లేదు. అయితే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టినా, ప్రకటనలు గుప్పించినా ఏపీ ప్రజలు మాత్రం జగన్ ప్రతి నిర్ణయానికీ బీజేపీ అండ ఉందనే ఇంకా నమ్ముతున్నాయి.
కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకూ ఏపీ ప్రజలలో బీజేపీ తాను జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని నమ్మించగలిగే అవకాశం లేదు.అమరావతే రాజధాని అంటే బీజేపీ విస్పష్టంగానే ప్రకటనలు గుప్పిస్తోంది. ఎలాంటి బేషజాలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్నీ వెలిబుచ్చుతోంది. అసెంబ్లీలో జగన్ మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన రోజునే కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఏపీ రాజధాని అమరావతే అని విస్పష్టంగా ప్రకటించారు. రాజధాని విషయంలో జగన్ రాజకీయాలు చేస్తున్నారనీ, అవేవీ నడవవనీ, అసెంబ్లీ ఎక్కడ ఉంటే అదే రాజధాని అనీ విస్పష్టంగా తేల్చేశారు.
కేంద్ర మంత్రి ఏదో యథాలాపంగా వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేము. కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్న తరువాతనే ఆయన రాజధాని అమరావతే నని విస్పష్టంగా ప్రకటించగలిగారు. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ కూడా రాజధాని అమరావతేననీ, ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదని తేల్చేశారు. ఇప్పుడు జగన్ అనుకున్నంత మాత్రాన రాజధాని మార్చడం అయన వల్ల కాదన్నారు. అయితే ఇదే బీజేపీ, కేంద్రం, కేంద్ర మంత్రులు కొంత కాలం కిందటి వరకూ రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమనీ, కేంద్రానికి సంబంధం లేదనీ చేసిన వ్యాఖ్యలను జనం మరచిపోలేదు. బీజేపీ గత మూడేళ్లుగా మూడు రాజధానుల విషయంలో జగన్ కు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చిందనే భావనే వారిలో బలంగా నెలకొని ఉంది.
ఇప్పుడు రాజధాని విషయంలో బీజేపీ అమరావతికి మద్దతు అని ప్రకటనలు గుప్పిస్తున్నా.. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలుగానే ఏపీ ప్రజ భావిస్తోంది. కేంద్రం నుంచి రాజధాని అమరావతికి అనుకూలంగా చర్యలు కనిపిస్తే తప్ప ప్రజలు కమలం పార్టీ ఏపీ నేతల ప్రకటనలు విశ్వసించే పరిస్థితి లేదు.
హై కోర్టు తీర్పును పట్టించుకోకుండా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ పై ఒత్తిడి తేవడంతో పాటు విభజన హామీల మేరకు కేంద్ర సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేసే విషయంలో వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏపీ జనం బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని, రాజధానిగా అమరావతే ఉండాలన్న విషయంలో ఆ పార్టీ చిత్తశుద్ధితోనే ఉందనీ నమ్మే అవకాశం ఉంది.