జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు
posted on May 21, 2021 @ 10:55AM
ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా నొటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదన్న హైకోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ 8న జరిగాయి. ఈ ఎన్నికలపై మొదటి నుంచి హైడ్రామానే నడిచింది. 2020 మార్చిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా.. కొవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడ్డాయి. 2021 ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు పరిషత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ నిలిచిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎస్ఈసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. గత నోటిఫికేషన్ ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన బెంచ్.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిలిపేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ ఎస్ఈసీ పిటిషన్ పై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాలు ప్రకటించరాదని పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఏప్రిల్ 8న 516 జెడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది పోటీ పడ్డారు.126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరిగినా.. హైకోర్టు ఆదేశాలతో లెక్కింపు జరగలేదు. తాజాగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచనంగా మారింది .